తెలంగాణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా ఇవాళ(ఆదివారం) సురక్షా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. పోలీసులు, ఇతర సంబంధిత శాఖల్లోని సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
భద్రతకు, భరోసాకు మారుపేరు, ప్రశాంతతకు చిరునామా తెలంగాణ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో శాంతి భద్రతల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలను ఉపయోగిస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం 9 ఏండ్లుగా పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణతో పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాష్ట్రంగా పేరుపొందిందన్నారు.
అంతేకాదు..మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ‘షీ టీమ్స్’, ‘షీ క్యాబ్స్’ వంటి వినూత్న ఆలోచనలతో ఆడబిడ్డల రక్షణకు భరోసానిస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన షీ టీమ్స్ అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. ప్రపంచంలో అత్యధిక సీసీటీవీలతో పటిష్టమైన శాంతిభద్రతల నిర్వహణ చేస్తున్న నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.