Editorials

ఒడిషా రైలు ప్రమాదంలో కుట్ర కోణం…..

ఒడిషా రైలు ప్రమాదంలో కుట్ర కోణం…..

రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ’లో మార్పులు చేయడమే ఒడిశాలో ఘోరమైన రైలు ప్రమాదానికి కారణమని బయటపడింది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా, విధ్వంసం సృష్టించే ఆలోచనతోనే ఇలా చేశారా అనేది నిగ్గుతేల్చడానికి సీబీఐని రంగంలో దించనున్నారు. ప్రమాదంలో రైల్వే లోకోపైలట్ల (డ్రైవర్ల) తప్పేమీ లేదని ఉన్నతాధికార వర్గాలు క్లీన్‌చిట్‌ ఇచ్చాయి. రైలు పట్టాలు మారుతూ వెళ్లడంలో ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థే ప్రధానం. ‘మా విచారణ పూర్తయింది. ఘోరకలికి మూల కారణమేమిటి, దానికి బాధ్యులు ఎవరనేది తేలింది. పాయింట్‌ మెషీన్‌ సెట్టింగ్‌ను మార్చారు. ఈ క్రిమినల్‌ చర్యను ఎందుకు, ఎలా చేశారనేది రైల్వే భద్రత కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) దర్యాప్తు నివేదికలో బయటపడుతుంది. అందువల్ల నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్లను. పూర్తి నివేదిక మాకు రానివ్వండి. రైళ్లు ఢీకొనకుండా నివారించే కవచ్‌ వ్యవస్థకు,ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదు’ అని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చెప్పారు. ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు సిఫార్సు చేసిందని వెల్లడించారు. ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలో మూడురైళ్లు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలసి పనులు పర్యవేక్షిస్తున్న ఆయన ఆదివారం బాలేశ్వర్‌ ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు. చికిత్స అనంతరం క్షతగాత్రుల్ని, వారి సంబంధీకుల్ని ఇళ్లకు చేర్చడానికి వీలుగా ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నట్లు చెప్పారు. 300 మంది బాధితుల రక్త సంబంధీకులకు పరిహారం చెల్లించామని చెప్పారు.