విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో జరిగిన ఒప్పందాలు అమలుపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కుదుర్చు కున్న ఒప్పందాలు, ప్రస్తుతం వాటి పరిస్థితులపై సీఎం సమగ్ర సమీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఒప్పందాలు…
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా 387 ఒప్పందాలు కుదుర్చుకున్నామని అధికారులు వెల్లడించారు. ఇందులో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు కుదిరాయని, ఇందులో 13 ఒప్పందాలు ఇప్పటికే వాస్తవ రూపం దాల్చాయని అధికారులు తెలిపారు.వీటి ద్వారా రూ.2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు వివరించారు.
రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలుపెట్టనున్నాయని అధికారులు వెల్లడించారు. జనవరి 2024 లోపు 38 కంపెనీలకు పనులు ప్రారంభం అవుతాయని, మార్చి 2024లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తిచేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెలన్నీకూడా ఫిబ్రవరి 2024 నాటికి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.