Health

నరసరావుపేటలో అక్రమ మందుల తయారీ….

న్పేటలో అక్రమ మందుల తయారీ….

నరసరావుపేటలోని ‘సేఫ్‌ ఫార్ములేషన్స్‌ సంస్థ’ ట్రెమడాల్‌ హైడ్రోక్లోరైడ్‌ మాత్రల తయారీలో అడుగడుగునా అక్రమాలకు పాల్పడింది. ఆర్డర్‌ కంటే ఎక్కువ మొత్తంలో మాత్రలను తయారు చేసింది. జనరిక్‌ పేరుతో అడిగితే.. ఏకంగా బ్రాండెడ్‌ పేర్లతో వాటిని సిద్ధం చేసింది. బెంగళూరులోని ఫస్ట్‌ హెల్త్‌ సొల్యూషన్‌ సంస్థ ద్వారా 2021 నవంబరు నుంచి 2022 డిసెంబరు అయిదో తేదీ మధ్య మూడు విడతలుగా 1,62,500 ప్యాక్‌లు (పది షీట్లు-వంద మాత్రలు) తయారీకి ఆర్డర్‌ రాగా.. 1,77,061 మాత్రలు ఉత్పత్తి చేసింది. అంటే 14,561 ప్యాకెట్లను అధికంగా తయారు చేసింది. జనరిక్‌ పేరుతో కావాలని బెంగళూరు సంస్థ కోరగా.. సుమారు లక్ష ప్యాకెట్లను బ్రాండెడ్‌ పేరుతో సిద్ధం చేసింది.

బెంగళూరుకు చెందిన ఐరీస్‌ హెల్త్‌ గ్లోబల్‌ వెల్‌నెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 54,750 ప్యాకెట్ల ట్రెమడాల్‌ 225 ఎంజీ మాత్రలు తయారు చేసింది. ఐరీస్‌ సంస్థ ఎగుమతి కోసం అనుమతులు పొందనప్పటికీ.. మాత్రల తయారీ చేపట్టడం గమనార్హం. ట్రెమడాల్‌ మాత్రలను కేంద్ర ప్రభుత్వం 2018లో మాదక ద్రవ్యాల నిరోధక చట్టం(ఎన్‌డీపీఎస్‌) పరిధిలోకి తెచ్చింది. వీటి తయారీ, నిల్వ, ఎగుమతులపై ఆంక్షలు విధించింది. విదేశాలకు వాటిని ఎగుమతి చేయాలంటే సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌(సీబీఎన్‌) నుంచి అనుమతి తప్పనిసరి. ఇవేమీ లేకుండానే. సేఫ్‌ సంస్థ బెంగళూరులోని ఐరిస్‌ సంస్థ నుంచి వచ్చిన ఆర్డర్ల మేరకు మాత్రలను తయారు చేయడం గమనార్హం.

సేఫ్‌ సంస్థ ఆవరణలో 225 ఎంజీ, 250 ఎంజీ మాత్రలు, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మరో ప్రైవేట్‌ సంస్థ ఆవరణలో 100 ఎంజీ ట్రెమడాల్‌ హైడ్రోక్లోరైడ్‌ మాత్రల తయారీ జరిగింది. తనిఖీల సందర్భంగా 68 రకాల మందులు/పత్రాలను ఔషధ నియంత్రణ పరిపాలనా శాఖ సీజ్‌ చేసింది. ఇందులో 51 ట్రెమడాల్‌ మాత్రలకు సంబంధించినవే కావడం గమనార్హం.