ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం శరవేగంగా దూసుకుపోతోందని, ఈ రంగంలో ఎంతో పురోగతి సాధించామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీ హబ్‌లో ఐటీ శాఖ 9వ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు… అనేకమంది ఆశ్చర్యంగా చూశారని, అయినా ఈరోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు తమ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగామని, హైదరాబాద్ ఐటి రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటిఐఆర్ ప్రాజెక్టుని కేంద్రం రద్దు చేసినా, ఈ ప్రగతి సాధ్యం అయ్యేలా చూడగలిగామన్నారు. దీంతోపాటు దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా సంక్షోభం ఆ తర్వాత మారిన పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధి సాధ్యమైందని, గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ ఐటి రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో.. జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఐటి, ఐటి అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగామని మంత్రి కేటీఆర్ వివరించారు.
2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ. 56 వేలు కోట్లు ఉంటే.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఒక లక్ష 83 వేల కోట్ల ఐటీ ఎగుమతులకు చేరుకున్నామని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో ఐటీ సెక్టార్‌లో 3 లక్షల 20 వేల ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 7 లక్షలకు పైచిలుకు ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్ నిలిచిందని అన్నారు.