ఒడిశాలో మూడు రైళ్ల ప్రమాద ఘటనను మరువకముందే మరో ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు కిందపడి ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గూడ్స్ రైలుకు ఇంజిన్ కూడా లేదు. రైల్వే స్టేషన్లో నిరుపయోగంగా ఓ మూలన పడి ఉంది. ఈదురు గాలుల వల్ల గూడ్స్ కదిలి ఆరుగురు మృతి చెందారు. ఒడిశా రాష్ట్రంలోని ఝాజ్‌పూర్ రైల్వే స్టేషన్లో ఓ గూడ్స్ రైలు చాలాకాలంగా నిరుపయోగంగా ఉంది. కాగా, స్టేషన్ వద్ద కొన్ని మరమ్మతు పనులు జరుగుతుండగా.. పనులు చేసేందుకుగాను కొందరు కార్మికులు స్టేషన్ వద్దకు వచ్చారు. వారు పనులు నిర్వహించే సమయంలో ఉన్నట్టుండి ఈదురు గాలులతో భారీ వర్షం మొదలైంది. దీంతో తలదాచుకునేందుకు కార్మికులు నిరుపయోగంగా ఉన్న గూడ్స్ రైలు బోగీ కిందకు చేరారు. ఈదురు గాలులు బలంగా వీయడంతో ఆగి ఉన్న గూడ్స్ రైలు ఉన్నట్టుండి కదిలి కార్మికుల మీదుగా వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన రైల్వే అధికారులు గాయపడ్డవారిని చికిత్స కోసం కటక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈదురుగాలులకు ఏకంగా గూడ్స్ రైలు కదిలి కార్మికులపై మీదుగా వెళ్లడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విధి రాత కాకపోతే అంత బరువు ఉండే రైలు బోగీలు గాలికి కదలడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.