ScienceAndTech

అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొచ్చా?

అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ తినొచ్చా?

అదేంటీ.. అంతరిక్షం (Space)లో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ (French Fries) ఎలా తింటారు?అక్కడ వండుకోవడం సాధ్యం కాదు కదా! అనేగా మీ సందేహం. ఈ సమస్యకు శాస్త్రవేత్తలు ఓ పరిష్కారం కనుగొన్నారు. ఇకపై భూమ్మీద ఉండేవారు వేడి వేడిగా.. కరకరలాడే ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ను తిన్నట్లే.. అంతరిక్షంలోనూ వ్యోమగాములు (Astronauts) వాటిని వేయించుకొని తినొచ్చు. దీనికోసం యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ (ESA)కి చెందిన శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. ఇకపై అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు సరికొత్త పద్ధతుల్లో ఆహార పదార్ధాలను వండుకోనున్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా బంగాళదుంప ముక్కలను వేయిస్తున్నారు. అలాంటప్పుడు అంతరిక్షంలో ఎందుకు వేయించకూడదు? అనే ప్రశ్నకు సమాధానంగానే తాము ఈ ప్రయోగాన్ని చేపట్టామని పరిశోధాన బృందం తెలిపింది. తాము ప్రయోగం కోసం రెండు విమానాల్లో గురుత్వాకర్షణ లేని చోటుకు వెళ్లామని, అక్కడే ఒక ప్రత్యేకమైన గుండ్రంగా తిరిగే పరికరంలో ఆయిన్‌ను బయటకు రాకుండా వేడిచేసి, అందులో బంగాళదుంప ముక్కలు వేశామని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆయిల్‌ బుడగల రూపంలో వాటి చుట్టూ చేరిందని, బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత ఆయిల్ బుడగలు వాటి నుంచి వేరయ్యాయని పరిశోధనా బృందం తెలిపింది. ఈ ఆవిష్కరణతో వ్యోమగాములు అంతరిక్షంలో ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటిని నూనెలో వేయించుకుని తినవచ్చని తెలిపారు. త్వరలోనే ఈ ప్రయోగాన్ని పూర్తి స్ధాయిలో అభివృద్ధి చేస్తామని ఈఎస్‌ఏ తెలిపింది.