NRI-NRT

కెనెడాలో భార‌తీయ విద్యార్థుల ఆందోళ‌న‌….

కెనెడాలో  భార‌తీయ విద్యార్థుల ఆందోళ‌న‌….

కెనడాలో 700 మంది భారతీయ విద్యార్థులు రోడ్డెక్కారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సుమారు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఫేక్ అడ్మిషన్ లెటర్లతో తమ దేశంలోకి అడుగు పెట్టారని ఆరోపిస్తూ కెనడా ప్రభుత్వం వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తుంది. దీనిలో భాగంగా ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులకు నోటీసులు కూడా జారీ చేశారు.

చదువుకుంటున్న వారికే కాకుండా చదువు పూర్తి చేసి ఉద్యోగాలు చేస్తున్న వారికి సైతం నోటీసులు ఇచ్చారు. దాంతో విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కెనడాలోని పలు యూనివర్సిటీల‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తున్నవారు నిరసనకు దిగారు. వీరిలో ఎక్కువ మందికి పంజాబ్ కు చెందిన వారు ఉన్నారని సమాచారం. ప్రస్తుతం విద్యార్థులు సిబిఎస్ఏ ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపడుతున్నారు.

రోడ్డుపైనే వంటలు చేసుకుని తింటూ రాత్రులు కూడా అక్కడే నిద్రపోతూ నిరసనలో పాల్గొంటున్నారు. చదువులో టాపర్లు అయిన తమకు ఫేక్ అడ్మిషన్ లెటర్లతో కెనడా రావాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. తమలో కొంతమంది ట్రావెల్ ఏజెంట్ల చేతిలో మోసపోయారని చెబుతున్నారు. అంతేకాకుండా బాధిత విద్యార్థుల పైన చర్యలు తీసుకోవడం ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమకు సాయం చేయాలంటూ ఇమిగ్రేషన్ వ్యవహారాల మంత్రి సీఎం ఫజర్ ను విద్యార్థులు అభ్యర్థించగా న్యాయం చేస్తా అంటూ హామీ ఇచ్చారని చెబుతున్నారు.