ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. మాగుంట రాఘవ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాఘవ్ రెడ్డి బెయిల్ కోసం చూపించిన కారణాలు సహేతుకంగా లేవని ఆరోపించింది.మాగుంట రాఘవకు 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ బుధవారం దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కోసం ఆయన చూపిన కారణాలు సరైనవి కావని.. సమీప బంధువుల ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. ఈ నేపథ్యంలో రేపు విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ అంగీకారం తెలిపింది.