NRI-NRT

భారతీయులకు విదేశీ వీసాల జారీలో ఆలస్యం ఎందుకు?

భారతీయులకు విదేశీ వీసాల జారీలో ఆలస్యం ఎందుకు?

భారతీయులకు వీసా జారీలో ఆలస్యానికి కారణమేంటని ఇద్దరు అమెరికా కాంగ్రెస్ సభ్యులు ఆ దేశ విదేశాంగ శాఖను ప్రశ్నించారు. అమెరికాకు పర్యటన, వ్యాపారం నిమిత్తం రావాలనుకునే భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం 450 నుంచి 600 రోజులు వేచి చూడాల్సి వస్తోందని సెనేట్ విదేశీ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు బాబ్ మెనెండెజ్ తెలిపారు. ఈ జాప్యం రెండు దేశాల వ్యాపార సంబంధాలను దెబ్బతీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇండియా కాకస్ సహ అధ్యక్షుడు మైఖేల్ వాల్ట్స్‌తో కలిసి రెండు కాంగ్రెస్ విచారణల్లో పాల్గొన్న బాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌ క్వాడ్‌ భాగస్వామి అనీ, రెండు దేశాల మధ్య వందల కోట్ల డాలర్ల వాణిజ్యం జరుగుతోందని కాంగ్రెస్‌ సభ్యుడు వాల్ట్స్‌ గుర్తుచేశారు. ఈ నెలలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు అధికార పర్యటన జరపబోతున్నారంటూ, వీసా నిరీక్షణ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారని ప్రశ్నించారు. శాసనకర్తల ప్రశ్నలకు సమాధానమిచ్చిన అమెరికా విదేశాంగ శాఖ  (దౌత్య వ్యవహారాలు) సహాయ మంత్రి రీనా బటర్‌ ఈ ఏడాది భారతీయులకు 10 లక్షల వీసాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. కొవిడ్‌ వల్ల దౌత్య కార్యాలయాల్లో పని కుంటుపడినా, ఇప్పుడు అదనపు ఏర్పాట్లతో వీసా దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని వివరించారు.