వర్షా కాలానికి నాంది పలికే మృగశిర కార్తె నేటి నుంచి ప్రారంభమైంది. జూన్ మొదటి వారంలో వచ్చే ఈ కార్తె వ్యవసాయ పనులకు రైతులు శ్రీకారం చుడతారు. ఇన్నాళ్లు వేసవి తాపంతో ఇబ్బందులు పడ్డ జనం ఈ కార్తెలో కురిసే తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతారు. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం, ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.
రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలతో సతమతమవుతుంటారు. మృగశిర కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఉపశమనం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో రైతులు ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. ఈ కాలంలో రుతుపవనాలు విస్తరించి తొలకరి వర్షాలు పడగనే రైతులు పొలాన్ని దున్ని పంటలు వేయడం ప్రారంభిస్తారు. మృగశిర కార్తె చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది.
ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తె రావడంతో వర్షాలు మొదలు కానున్న నేపథ్యంలో పలు వ్యాధులు వచ్చే అవకాశాలుంటాయి. ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు, ఇతర వ్యాధుల బారిన పడుతుంటారు.
ఇలాంటి నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందేనని చెబుతుంటారు. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. మృగశిరకార్తె రోజున ఏ ఇంటా చూసినా చేపల పులుసు, చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి.