ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రమఫోసా (South African President Cyril Ramaphosa) తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల (Bilateral relations) పురోగతిపై సమీక్షించారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. చారిత్రాత్మకమైన, బలమైన ప్రజల మధ్య సంబంధాలతో ముడిపడిఉన్న ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించినట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో 12 చిరుతలను భారత్ కు తరలించినందుకు దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
సౌతాఫ్రికా అధ్యక్షుడు రమాఫోసా ఆప్రికన్ నేతల శాంతి చొరవను ప్రధాని మోదీకి వివరించారు. ఈక్రమంలో యుక్రెయిన్‌లో శాంతి, సుస్థిరతను నిర్దారించడానికి ఉద్దేశించిన అన్ని కార్యక్రమాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. భారతదేశం జీ-20 చైర్మన్ షిప్‌లో భాగంగా భారతదేశం యొక్క చొరవకు అధ్యక్షుడు రమాఫోసా తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. భారత దేశంలో పర్యటనకోసం తాను ఎదురుచూస్తున్నానని పేర్కొన్నట్లు పీఎంఓ వర్గాలు తెలిపాయి.
ఈ ఏడాది బ్రిక్స్ కూటమిలో దక్షిణాఫ్రికా చైర్మన్‌గా ఉంది. ఈ సందర్భంగా బ్రిక్స్‌లో సహకారంతో సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అనేక ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. బ్రిక్స్ అనేది చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలతో కూడిన అంతర్జాతీయ సమూహం. ఈనెల 1, 2 తేదీల్లో దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్‌లో బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే ఇదిలాఉంటే దక్షిణాఫ్రికా ప్రధానితో ఫోన్‌లో పలు విషయాలపై మాట్లాడినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని సమీక్షించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా బ్రిక్స్, ఆఫ్రికన్ లీడర్స్ పీస్ ఇనిషియేటివ్‌లో సహకారంతో సహా ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై చర్చించడం జరిగిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.