Politics

ఎంపీ కోమటిరెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ…

ఎంపీ కోమటిరెడ్డితో పొంగులేటి, జూపల్లి భేటీ…

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతున్న ఖమ్మం ముఖ్య నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎంపీ కోమటిరెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూబ్లీహిల్స్‌లోని కోమటిరెడ్డి నివాసంలో సమావేశం కొనసాగుతోంది.ఈ బేటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వచ్చిన పొంగులేటి.. మీడియా ఉండటంతో ఆగకుండా వెళ్లిపోయారు. అయితే పొంగులేటి, జూపల్లికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన అనంతరం బీజేపీ వైపు మొగ్గు చూపగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లితో భేటీ అనంతరం మీడియాతో కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించామన్నారు. జూపల్లి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదన్నారు. చాలా మంది ముఖ్య నేతలతో రోజూ మాట్లాడుతున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక విషయం తెలియదన్నారు. ఫోన్ రావడంతో పొంగులేటి మరోసారి కలుస్తా అని వెళ్లిపోయినట్లు తెలిపారు.

జూపల్లి మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరాలో ఇంకా డిసైడ్ కాలేదన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై బీఆర్ఎస్ నాయకత్వం సస్పెన్షన్ వేటేసింది. దీంతో ఈ ఇద్దరు నేతలతో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు చర్చలు జరిపారు. బీజేపీ కంటే కాంగ్రెస్ లో చేరేందుకు ఈ ఇద్దరు నేతలు ఆసక్తిని చూపుతున్నారు. కాంగ్రెస్ లో చేరే విషయమై చర్చించినట్టుగా ప్రచారం సాగుతుంది. రెండు రోజుల క్రితం ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. రెండు మూడు రోజుల్లో ఏ పార్టీలో చేరే విషయమై స్పష్టత ఇవ్వనున్నట్టుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. అయితే వేరే అర్జంట్ పని ఏదో ఉండడంతో కారు దిగకుండానే తిరిగి వెళ్లిపోయారు.