తమకు సమీపంలో ఉన్న క్యూబాలో చైనా కొన్నేళ్లుగా గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తోందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. దీంతో గూఢచర్యంపై అమెరికా (USA), చైనా (China)ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. క్యూబా(Cuba)లో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి చేసిన వ్యాఖ్యల ఆధారంగా అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో డొనాల్డ్ ట్రంప్ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు.
‘2019లో క్యూబాలోని గూఢచర్య సేకరణ వ్యవస్థలను చైనా అప్‌గ్రేడ్ చేసింది.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి ఇంటెలిజెన్స్ రికార్డు (అమెరికా)ల్లో పక్కాగా ఉన్నాయి’’ అని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అనుమతించింది. దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణకు డ్రాగన్‌కు అవకాశం లభించినట్టయింది. ఈ అంశాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం కూడా ప్రస్తావించింది. ఇరు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని, ప్రతిఫలంగా క్యూబాకు చైనా ఆర్ధిక సాయం చేయడానికి సిద్ధమైనట్టు పేర్కొంది. దీంతో బైడెన్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి నెలకొంది.
అయితే, దీనిని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కెర్బీ తోసిపుచ్చారు. ‘ఈ నివేదికలు పూర్తిగా కచ్చితమైనవి కావు.. ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే… ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడం లేదు’’ అని పేర్కొన్నారు. అమెరికా సముద్ర రవాణ నిఘా, గ్వాంటనామో నౌకా స్థావరంలో కదలికలు గమనించడం, కమ్యూనికేషన్లపై దృష్టిపెట్టడం వంటి అంశాలను చైనా ఇంటెలిజెన్స్ సర్వీసులు పరిశీలిస్తున్నాయి.
మరోవైపు, అమెరికా మీడియా కథనాలను క్యూబా డిప్యూటీ విదేశాంగ మంత్రి కార్లోస్ ఫెర్నాండో డి కాసియో కూడా ఖండించారు. ఎటువంటి ఆధారాల్లేకుండానే అమెరికా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచురిస్తూ.. కనీసం నియమాలను కూడా పాటించడంలేదని విమర్శించారు. కాగా, ఈ కథనాలపై చైనా కూడా తీవ్రంగా స్పందించింది. క్యూబా అంతర్గత వ్యహారాల్లో అమెరికా జోక్యంపై హెచ్చరికలు చేసింది.
చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ మాట్లాడుతూ… తొలుత అక్కడి పరిస్థితి తెలియదని చెప్పారు. ‘వదంతలు, అపవాదులను వ్యాప్తి చేయడం అమెరికా శైలి.. ఇష్టానుసారంగా పరాయి దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంలో పేటెంట్ పొందింది’ అని దుయ్యబట్టారు.