Politics

కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా….

కేసీఆర్ కు చంద్రబాబు రిటర్న్ గిఫ్ట్  ఇవ్వబోతున్నారా….

టీడీపీ అధినేత చంద్రబాబు తలుచుకుంటే ఎంతమందికై నా గిఫ్టులు ఇయ్యగలరు. అయితే ఈసారిఆయన ఓ భారీ గిఫ్ట్ సిద్ధం చేస్తున్నారట. తనను టార్గెట్ చేసిన ఒకరికి మాత్రం ఆయన ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట. అది ఎప్పుడో.. ఎక్కడో తెలియదు.

అయితే ఆ రిటర్న్ గిఫ్ట్ ఎవరికంటే.. ఆయనకు ఒకప్పటి సహచరుడు. కొన్నేళ్లు రాజకీయ ప్రత్యర్థిగా నిలిచిన సీఎం కేసీఆర్కు అని. 2019 ఎన్నికల్లో ఏపీ సీఎంగా జగన్ గెలుపులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాత్ర ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు కారణం చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేకున్నా 2018 ఎన్నికల్లో తెలంగాణ ఎణ్నికల్లో జోక్యం చేసుకోవడమే. ఎన్నికల్లో కేసీఆర్ విజయం తర్వాత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని బహిరంగంగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే 2019 ఎన్నికల్లో జగన్ కు అంగ, అర్థబలంతో సహకరించారు. చంద్రబాబుకు దీటుగా వ్యూహాలు పన్ని జగన్ కు పూర్తిస్థాయిలో సహకరించారు.

అయితే చంద్రబాబు కూడా సీఎం కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డాను కలిశారు. తెలంగాణలో ఉన్న టీడీపీ శ్రేణుల ఓట్లను బీజేపీ వైపు మళ్లించి సహకరిస్తానని వారికి మాటిచ్చినట్లు తెలిసింది. ముందుగా తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి, త్వరలో ఏపీలో జరిగే ఎన్నికల్లో తనకు రూట్ క్లియర్ చేసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి కూడా జగన్, కేసీఆర్ ఒక్కటిగా తనపై కుట్రలు చేస్తున్నారని ఆయన నమ్మడమే ఇందుకు కారణం. కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఏపీలో జగన్ కు 2024 ఎన్నికల్లో పాజిటివ్ అవుతుందని ఆయన లనుకుంటున్నారు. అందుకే బాబు ముందునుంచే మంత్రాంగం మొదలుపెట్టినట్లు టాక్

అయితే ఒకవేళ బీజేపీ సహకరించకపోతే, కాంగ్రెస్ తో కలిసైనా తెలంగాణలో కేసీఆర్ కు అడ్డుకట్ట వేయాలని ఆయన భావిస్తున్నారు. నలభై ఏండ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు మరి రెండు రాష్ర్టాల్లో అందరికీ తెలిసిన నేత. సీఎంగా 14 ఏండ్ల అనుభవం ఉన్న ఆయన చక్రం తిప్పాలని అనుకుంటున్నారు.. కానీ తెలంగాణ ప్రజల దీవెనలు ఇప్పటికైతే కేసీఆర్కు ఉన్నాయని మాత్రం ఆయన ఆర్థం చేసుకోలేకపోతున్నారు. ముందుగా ప్రజల్లోంచి ఈ ఎదురుగాలి తెస్తే తప్పా, చంద్రబాబు ఆలోచనలు ఫలించే దాఖలాలు కనిపించడం లేదు. మరి రానున్న రోజుల్లో ఈ రిటర్న్ గిఫ్ట్ ఎవరికి అందాలో ఇటు తెలంగాణ.. అటు ఏపీలో ప్రజలే నిర్ణయించాలి.