అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాన్ అతి తీవ్రంగా మారడంతో తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గుజరాత్ వైపుగా తుపాన్ (cyclone) వేగంగా దూసుకొస్తోంది. మరో 36 గంటల్లో గుజరాత్‌లోని కచ్, పాకిస్తాన్‌లోని కరాచీల మధ్య తీరం దాటనుంది. ఈక్రమంలో తీర ప్రాంత రాష్ట్రాలతో సహా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. సోమవారం ప్రధాని మోడీ (PM Modi) బిపోర్‌జాయ్ తుపాన్‌పై కీలక సమీక్ష నిర్వహించారు.
సోమవారం మధ్యాహ్నం తర్వాత ఈ సమావేశం జరిగింది. బిపోర్ జాయ్ తుపాన్ ప్రస్తుత పరిస్థితి, ముందస్తు సహాయక చర్యల ఏర్పాట్లు, తీసుకోవలసిన చర్యలు, తుపాన్ ముప్పు ఏయే ప్రాంతాలపై ఉంటుంది అనే అంశాలపై సమీక్షలో ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ క్రమంలో అధికారులకు ప్రధాని మోడీ పలు కీలక సూచనలు చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాన్ ఎఫెక్ట్, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తు చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
మరోవైపు వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. పలు తీర ప్రాంత రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్స్యకారులు వారం రోజుల పాటు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. ముఖ్యంగా గుజరాత్, ముంబై తీర ప్రాంతాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.