Editorials

జనాభాతో ప్రకృతి నాశనం….

జనాభాతో ప్రకృతి నాశనం….

వాతావరణ మార్పులు ప్రపంచ దేశాలకు పెను విపత్తుగా పరిణమిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఆకస్మిక వరదలు, అదే సమయంలో మరికొన్ని దేశాల్లో కరువులు.. ఇవన్నీ వాతావరణ మార్పుల ఫలితాలే. ఈ విపత్తు వల్ల ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకూ ముప్పు ఉన్నప్పటికీ భారత్‌కు మాత్రం ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని, దేశంలోని అధిక జనాభాయే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం(యూఎన్‌ఈపీ) కార్యనిర్వాహక డైరెక్టర్‌ ఎరిక్‌ సొల్హీమ్‌ స్పష్టం చేయడం గమనార్హం. వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రపంచమంతటా కనిపిస్తున్నాయని చెప్పారు. అధిక జనాభా వల్ల భారత్‌ మరింత దుర్బల దేశంగా మారనుందని హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

  • భూగోళం ఎదుర్కొంటున్న అన్ని రకాల పర్యావరణ సమస్యలు భారత్‌కు కూడా ఎదురవుతున్నాయి.
  • భారత్‌లో ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు నగరాలు, పట్టణాలు ఇప్పటికే కాలుష్యంతో నిండిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత గురించి తెలిసిందే.
  •  నానాటికీ పెరిగిపోతున్న జనాభా, తద్వారా మానవ కార్యకలాపాలు ఈ కాలుష్యానికి, విపత్కర పరిస్థితులకు కారణమవుతున్నాయి.
  •  వాతావరణ మార్పుల ముప్పు అమెరికాతో పోలిస్తే భారత్‌కు అధికంగా ఉంది.
  •  భారత్‌లో ప్రకృతి విధ్వంసం కొనసాగుతోంది. మానవ ఆవాసాలు, వ్యవసాయం కోసం అడవులను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ప్రకృతి సమతుల్యతకు దోహదపడే జంతుజాలం నశిస్తోంది. జీవవైవిధ్యం క్రమంగా కనుమరుగవుతోంది.
  •  పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి ప్రకృతిని బలి చేయక తప్పడం లేదు. పరిమిత జనాభా కలిగిన దేశాలు, జనాభా పెరుగుదలను నియంత్రిస్తున్న దేశాల్లో ఇలాంటి పరిస్థితి పెద్దగా లేదు.
  •  భారత్‌లో జనాభా పెరుగుదలను నియంత్రిస్తే కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు. వాతావరణ మార్పులను కూడా నియంత్రించవచ్చు.
  •  భారత్‌ జనాభా 142 కోట్ల పైమాటే. జన విస్ఫోటనంతో ప్రపంచ కాలుష్య దేశాల జాబితాలో భారత్‌ మొదటి స్థానానికి చేరే రోజులు ఎంతో దూరంలో లేవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  •  భూగోళంపై పర్యావరణాన్ని చక్కగా కాపాడుకుంటేనే మనుషులకు, జీవజాలానికి ఆవాస యోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలన్నీ పర్యావరణ పరిరక్షణపై తక్షణమే దృష్టి పెట్టాలి.
  • చైనాలో 100 శాతం విద్యుదీకరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఇతర దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నమే జరగాలని నిపుణులు సూచిస్తున్నారు.