విదేశాలకు వెళ్లాలంటే అంత సులభమైతే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఇలాంటి సమయాల్లో స్కాలర్‌షిప్స్ ఉపయోగపడతాయి. చాలా సంస్థలు విద్యార్థులకు ఇటువంటి ఆర్థిక సహకారం అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకుని అవకాశం ఉన్నవాటికి దరఖాస్తు చేయడం ద్వారా అర్హత మేరకు ప్రయోజనం పొందవచ్చు. స్కాలర్‌షిప్స్ అనేవి విద్యార్థుల సమర్థత, మార్కులు, ఇతర అర్హతలను పరిశీలించి ఇస్తారు. ఇవి ఖరీదైన ఉన్నత విద్యను తక్కువ ఖర్చుతో అందేలా సహాయం చేయగలవు. ట్యూషన్ ఫీజు, వసతి, రవాణా ఖర్చులు ఇందులో ఇస్తారు. విదేశాల్లో చదవడం వ్యక్తిగతంగానూ వృత్తిపరంగానూ ఉపయోగపడుతుంది. ఇతర దేశాలకు వెళ్లడం ద్వారా విభిన్నమైన సంస్కృతుల గురించి తెలుసుకునే వీలుంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి.
విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు వివిధ రకాల స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. కొన్ని దేశాలను బట్టి ఇస్తారు. మరికొన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు ఫౌండేషన్లు, కార్పొరేట్ కంపెనీలు ఇస్తుంటాయి. ఇలా ఇచ్చే స్కాలర్‌షిప్‌లు ప్రతిభ, అవసరాల ప్రాతిపదికన, అణగారిన వర్గాలకు ఇచ్చేవిగా ఉంటాయి. అకడమిక్ లక్ష్యాలు, ఆర్థిక అవసరాలకు తగిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
మన ప్రొఫైల్‌కు సరిపడా స్కాలర్‌షిప్ వెతకడం, తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకోవడం అవసరం. స్కాలర్‌షిప్ డేటాబేస్ కోసం, గవర్నమెంట్ అందించే వాటి గురించి, అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే ఫండ్స్ గురించి తెలుసుకోవడం ద్వారా సరిగ్గా ప్రణాళిక వేసుకోవచ్చు. కెరియర్ గైడెన్స్ ఆఫీస్, ప్రొఫెసర్స్, అకడమిక్ అడ్వైజర్స్ వంటి వారి ద్వారా ఈ సమాచారం సేకరించవచ్చు. ఇదే సమయంలో దరఖాస్తుల గురించి తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. దానికి తగిన విధంగా ముందు నుంచే దరఖాస్తులు సిద్ధం చేసుకోవాలి.స్కాలర్‌షిప్‌కి దరఖాస్తు చేసినప్పుడు కమిటీకి బలమైన, ఆసక్తికరమైన ప్రొఫైల్‌ను అందించడం అవసరం. అకడమిక్ రికార్డ్, విజయాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, పర్సనల్ స్టేట్‌మెంట్.. ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఎంచుకున్న సబ్జెక్టులో మనకున్న ఆసక్తి, దాన్ని అభ్యసించడంలో అందుకున్న మెట్లు.. అన్నీ రాయవచ్చు. స్కాలర్‌షిప్ ఇచ్చే సంస్థ విధివిధానాలు, అంచనాలకు తగినట్టుగా ప్రొఫైల్‌ను దరఖాస్తులో ఆవిష్కరించాలి. మెంటర్స్, అధ్యాపకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని దరఖాస్తును మెరుగుపరచాలి.