కిడ్నీల్లో రాళ్లు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. సాధారణంగా కిడ్నీలో ఏర్పటే రాళ్లు చాలా చిన్న సైజులో ఉంటాయి. ఆపరేషన్తోపని లేకుండానే మందుల ద్వారా వాటంతట అవే కరిగిపోయేలా డాక్టర్లు మందులు ఇస్తుంటారు. ఐతే కొన్ని సందర్భాల్లో రాళ్ల సైజు కాస్త పెద్దగా ఉండటంతో సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఎంతపెద్ద రాళ్లైనా 20 నుంచి 30 గ్రాముల వరకు బరువుంటాయి.ఈ నెల ఒకటో తేదీన శ్రీలంక రాజధాని కొలంబోలో సైనిక ఆసుపత్రిలో ఓ రోగి కిడ్నీ నుంచి అతిపెద్ద రాయిని డాక్టర్లు విజయవంతంగా బయటకుతీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా బయటపడ్డ కిడ్నీ స్టోన్స్లో ఇదే పెద్ద రాయిగా రికార్డుకెక్కింది.
ఈ రాయి బరువు 801 గ్రాములు, పొడవు 13.37 సెంటీమీటరు. ఇది రెండు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టడం గమనార్హం. 2004లో భారతదేశంలో 13 సెంటీమీటర్ల పొడవున్న కిడ్నీ స్టోన్‌ను, 2008లో పాకిస్తాన్లో 620 గ్రాముల బరువున్న రాయిని బయటకు తీశారు. శ్రీలంకలో వెలికితీసిన రాయి ఆ రెండింటినీ అధిగమించింది.