మన ఫోన్‌లో రెండు సిమ్‌కార్డులున్నా.. ఆ రెండు నంబర్లతో ఒకేసారి వాట్సాప్ (WhatsApp) వాడలేం. ఒకవేళ అలా వాడాలంటే అయితే, క్లోనింగ్ యాప్ లేదంటే బిజినెస్ యాప్ వాడాల్సిందే. అలా కాకుండా వేర్వేరు అకౌంట్లను ఒకే యాప్‌లో వాడుకునే వీలుంటే ఎంత బాగుంటుందో కదూ! సరిగ్గా వాట్సాప్ సైతం అదే చేస్తోంది. ఒకటే యాప్‌లో వేర్వేరు అకౌంట్లు (multi account) వాడుకునే సదుపాయాన్ని తీసుకొస్తోంది.
వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.23.13.5లో ఈ ఫీచర్ కనిపించింది. వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు అందించే వాబీటా ఇన్ఫో ఈ ఫీచర్‌ను గుర్తించింది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఫీచర్.. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఫీచర్ వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కనిపించింది. రెగ్యులర్ యాప్‌లో సైతం తీసుకొచ్చే అవకాశం ఉందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.
ఇక ఈ ఫీచర్ విషయానికొస్తే.. ఓ వ్యక్తి కుటుంబ సభ్యుల కోసం ఒక వాట్సాప్ అకౌంట్, ఆఫీసు అవసరాలకు మరో అకౌంట్ వాడుతున్నారనుకుందాం. ప్రస్తుతానికి ఇలా రెండు వేర్వేరు అకౌంట్లు వాడాలంటే క్లోనింగ్ యాప్ తప్పనిసరి. అదే వాట్సాప్ తీసుకురాబోయే ఫీచర్ ద్వారా సింగిల్ క్లిక్‌తో అకౌంట్ల మధ్య స్విచ్ అవ్వొచ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ను మారిస్తే మీకు కావాల్సిన అకౌంట్‌తో వాట్సాప్‌ను ఉపయోగించొచ్చు. వాబీటా ఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ను బట్టి రెండు కంటే ఎక్కువ అకౌంట్లు వాడుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.