Editorials

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్….

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్….

జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర అలజడి ఈ మధ్య కాలంలో మళ్లీ పెరిగింది. తరచూ ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతున్నాయి. అలెర్ట్ అయిన పోలీసులు, భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లతో విరుచుకు పడుతున్నారు. కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం అలజడి రేపింది. జమ్ముకశ్మీర్ పోలీసులతో పాటు భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఎన్‌కౌంటర్ చేశారు. నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కుప్వారా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ సమయంలోనే ఉన్నట్టుండి ఉగ్రవాదులు కాల్పులు మొదలు పెట్టారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఇప్పటికే పూంఛ్ జిల్లాలో ఉగ్ర కుట్రల్ని భగ్నం చేసిన భద్రతా బలగాలు…ఉగ్ర క్యాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ భారీ ఎత్తున ఆయుధాలు సీజ్ చేశారు. స్టీల్ కోర్ క్యాట్‌రిడ్జ్‌లతో పాటు పాకిస్థాన్‌లో తయారైన మందులనూ రికవర్ చేసుకున్నారు. దాదాపు రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కచ్చితమైన సమాచారం ఆధారంగానే జాయింట్ ఆపరేషన్‌లు చేపడుతున్నామని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. పలు చోట్ల సంచుల కొద్దీ AK-47 తుపాకులనూ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్స్‌, గ్రనేడ్స్ కూడా పలు చోట్ల గుర్తించారు. ఎప్పటికప్పుడు ఉగ్ర కదలికలపై నిఘా పెడుతున్నారు. ఎలాంటి విధ్వంసానికి పాల్పడక ముందే వాళ్ల ఆపరేషన్లను అడ్డుకుంటున్నారు. అయితే..పలు చోట్ల మంచు కురుస్తున్న కారణంగా…పోలీసుల కళ్లు గప్పి కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని తిరుగుతున్నారు.