Business

తగ్గిన బంగారం, వెండి ధరలు…TNI నేటి వాణిజ్య వార్తలు

తగ్గిన బంగారం, వెండి ధరలు….

* రేషన్ కార్డ్‌తో ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

ఈ రోజుల్లో నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇతర సర్టిఫికేట్లతో పాటు రేషన్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ ఐడికార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇలా అన్నింటిని ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధనలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో రేషన్‌ కార్డును కూడా ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. వీటిని అనుసంధానించేందుకు గడువు ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో ఈ గడువు జూన్‌ 30, 2023 వరకు మాత్రమే ఉండేది. ఈ గడువు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

* లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజే రూ. 2 లక్షల కోట్లు పెరిగింది. సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్లు పెరిగాయి. ఇవాళ మార్కెట్లను ఏఏ అంశాలు ప్రభావితం చేశాయి, ఏఏ షేర్లు లాభాలను ఆర్జించాయో తెలుసుకుందాం. ఉదయం సెషన్ లో లాభాలతో ప్రారంభమైన సూచీలు ఇవాళ మొత్తం అదే జోరును కొనసాగించాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ ఈ సెన్సెక్స్ 467 పాయింట్లు పెరిగి 63,385 పాయింట్లకు చేరుకుంది. ఇక జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 138 పాయింట్లు వృద్ధి చెంది 18,826 వద్ద స్థిరపడింది.

* AIతో 8 లక్షల ఉద్యోగాలు పోతాయ్

ఐటీ (IT) రిక్రూట్‌మెంట్ సంస్థ వెంచురెనిక్స్ నిర్వహించిన ఒక అధ్యయనం కీలక విషయాలను వెల్లడించింది. కొన్ని రోజులుగా ఏఐ టెక్నాలజీతో ఉద్యోగాలు పోతాయన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని ధృవీకరిస్తూ వెంచురెనిక్స్ ఆసక్తికర విషయాలను పంచుకుంది. 2028 నాటికి హాంకాంగ్‌లోని 25% శ్రామికశక్తికి సమానమైన 8లక్షల ఉద్యోగాలు కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతలతో స్థానభ్రంశం చెందుతుందని అంచనా వేసింది. ఈ పరిణామంతో డేటా ఎంట్రీ క్లర్క్‌లు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్స్ వంటి వారిపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది. AI ప్రభావం న్యాయవాదులు, అనువాదకులు (ట్రాన్స్ లేటర్లు), ఇలస్ట్రేటర్లు, కంటెంట్ క్రియేటర్స్ వంటి వివిధ రంగాలకు మించి విస్తరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

* తగ్గిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు తగ్గాయి. క్యారెట్ల 10 22 గ్రాముల బంగారం రూ. 350 తగ్గడంతో రూ.54,700కి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గడంతో రూ. 59,670కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.1,000 తగ్గడంతో రూ. 77,500కి చేరింది. తెలుగు రాష్ట్ర రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

* జాబ్‌ నుంచి తీసేసినందుకు రూ.210 కోట్లు వచ్చాయ్‌

జాతివివక్ష నెపంతో తనను జాబ్‌ నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన కేసులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.210కోట్లు) చెల్లించాలని ఫెడరల్‌ జ్యూరీ సంస్థను ఆదేశించింది.

* ఫీజుల పెంపుపై పాలిటెక్నిక్ కాలేజీలకు అనుమతిస్తూ టీఎస్ హైకోర్టు ఉత్తర్వులు

ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల ఫీజులను రూ.40 వేలకు పెంచుకునేలా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇంతకన్నా తక్కువ ఫీజులు నిర్ణయిస్తే.. ఆ మొత్తాన్ని విద్యార్థులకు కాలేజీలు వెనక్కి ఇవ్వాలని తెలిపింది. కాలేజీలను ఏఎస్ఆర్సీ పరిధిలోకి తీసుకురావడంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను తిరిగి ఈ నెల 26కి వాయిదా వేసింది.

* ఫేస్ బుక్ అకౌంట్ లాక్ పై కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి

ప్రస్తుత రోజుల్లో చాలామంది అనేక రకాల సోషల్ మీడియా యాప్స్ వినియోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాషతో సంబంధం లేకుండా ఎక్కువ శాతం మంది వినియోగిస్తున్న యాప్ ఫేస్‌బుక్‌. మామూలుగా ఈ ఫేస్‌బుక్‌ యాప్ కొన్ని కొన్ని సార్లు లాక్ పడుతూ ఉంటుంది.. అటువంటి సమయంలో ఫేస్‌బుక్‌ కి రిపోర్ట్ చేసి వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవచ్చు. కొన్ని కొన్ని సార్లు ఫేస్‌బుక్‌ వారు స్పందించకపోవడంతో చాలామంది చిర్రెత్తుకొచ్చి వేరే ఫేస్‌బుక్‌ అకౌంట్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా తన ఫేస్‌బుక్‌ అకౌంట్ లాక్ అయినందుకు కోర్టును ఆశ్రయించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో జరిగింది.అకౌంట్‌ను లాక్‌ చేయడంపై 2022 ఆగస్టులో కోర్టులో దావా వేశాడు. ఎలాంటి ఉల్లంఘనా లేకపోయినా తన అకౌంట్‌ను ఫేస్‌బుక్‌ లాక్‌ చేసిందని ఆరోపించాడు. తాను అప్‌లోడ్‌ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. దావా వేసినా ఫేస్‌బుక్‌ లీగల్‌ టీమ్‌ స్పందించలేదు. ఈ చర్య న్యాయమూర్తికి సైతం కోపం తెప్పించింది. దాంతో 50 వేల డాలర్లు అనగా భారత కరెన్సీ ప్రకారం రూ.41 లక్షలు చెల్లించాలని మెటాను ఆదేశించారు. ఇక న్యాయస్థానం ఆదేశాలపై వెంటనే స్పందించిన మెటా క్రాఫోర్డ్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను పునరుద్ధరించింది. పరిహారం కోసం తాను దావా వేయలేదని, వినియోగదారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించకూడదన్న ఉద్దేశంతోనే వేసినట్లు క్రాఫోర్డ్‌ పేర్కొన్నారు

* విశాఖలో మండుతున్న కూరగాయల ధరలు

విశాఖలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రైతు బజార్లు, ఓపెన్ మార్కెట్ అన్న తేడా లేకుండా ధరలు మండిపోతుండటంతో సామాన్యలు ఇబ్బందులు పడుతున్నారు. రైతు బజార్లలో నాలుగైదు రకాల కూరగాయలు తప్ప.. మరేవీ లభించడం లేదు. ఎండల ప్రభావం కూరగాయల పంటలపై పడిందంటున్నారు రైతులు.. దిగుబడి గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లలో కొరత ఏర్పడి ధరలు పెరిగాయని చెబుతున్నారు. మరో వైపు వినియోగదారులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదని నిట్టూరుస్తున్నారు.

* చల్ల.. చల్లని స్టాండ్ ఫ్యాన్.. చౌకైన ధరలో ఏసీ లాంటి కూలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎండలు దంచికొడుతున్నాయ్. మండే మాడును చల్లబరిచేందుకు జనాలు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇవి కొనాలంటే సామాన్యులకు పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. మరి వారికి బడ్జెట్‌లో ఇల్లంతటికి కూలింగ్ నింపేందుకు ఓ స్టాండింగ్ ఫ్యాన్‌ చాలు. అవునండీ.! స్ప్రింక్లర్ ఫ్యాన్‌లు ఇటీవల మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఏసీ, కూలర్లు కొనే బడ్జెట్ లేనివారు.. ఈ ఫ్యాన్‌లపై ఆధారపడుతున్నారు.