* శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లులేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ అతిథిగృహం వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 71 వేల మంది భక్తులు దర్శించుకోగా..38వేల మంది తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.07కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
* జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్….
జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర అలజడి ఈ మధ్య కాలంలో మళ్లీ పెరిగింది. తరచూ ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతున్నాయి. అలెర్ట్ అయిన పోలీసులు, భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్‌లతో విరుచుకు పడుతున్నారు. కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు చనిపోయారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరగడం అలజడి రేపింది. జమ్ముకశ్మీర్ పోలీసులతో పాటు భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఎన్‌కౌంటర్ చేశారు. నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కుప్వారా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు
* తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం
తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయ సమీపంలోని ఫొటో ఫ్రేమ్స్ తయారీ షాపులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మాడవీధుల్లో రాకపోకలను నిలిపివేశారు.
* వివేకా హత్య కేసు.. ఆరుగురి నిందితుల రిమాండ్ పొడిగింపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. నిందితులు గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల రిమాండ్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఆరుగురు నిందితులను పోలీసులు ఇవాళ సీబీఐ కోర్టులో హాజరు పరిచారు.
* నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి….
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముర్ము ఈ రోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయమంలో దిగనున్న ఆమె నేరుగా రాజ్‌భవన్ చేరుకుని ఈ రోజు రాత్రి అక్కడ బస చేయనున్నారు. శనివారం ఉదయం దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (సీజీపీ) కు ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారు. పరేడ్ శిక్షణలో ప్రతిభ చూపిన క్యాడెట్లకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే ముర్ము ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.
* రాష్ట్రంలోకి ప్రవేశించని రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి రాకుండా దోబూచులాడుతున్నాయి. ఈ నెల 11న ఏపీలోకి ప్రవేశించిన రుతుపవనాలు రాయలసీమ ప్రాంతంలో స్తంభించాయి. కాగా ఈ సమయానికి దేశంలోని సగం రాష్ట్రాల్లో వర్షాలు కురిసి.. రైతులు తమ వ్యవసాయ పనులు ప్రారంభించాల్సి ఉంది. జూన్ 9న కేరళను తాకిన రుతుపవనాల ప్రభావం రాష్ట్రాల్లో కనిపించడం లేదు. దీంతో రైతులు కొంత నిరాశలో ఉన్నారు.
* పోస్టల్ లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వరుసగా జాబ్ నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ వస్తుంది.. ఈమేరకు పోస్టల్ లో ఖాళీ ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఇటీవల పోస్టల్ డిపార్ట్ టెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..ఇటీవల 40వేలకు పైగా గ్రామీణ్ డక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.. దానికి ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. 12 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి పోస్టల్ శాఖ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది..స్పెషల్ జీడీఎస్ ఆన్ లైన్ ఎంగేజ్ మెంట్ కింద 5,746 బీపీఎం అండ్ 7,082 ఏబీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ కోసం పూర్తి సమాచారం కోసం https://indiapostgdsonline.gov.in/ వెబ్ సైట్ సందర్శించవచ్చు
* పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరున ఖమ్మంలో కాంగ్రెస్ భారీ సభ నిర్వహిస్తుండగా, ఈ సభలో పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం
* 22కి.మీ. పరుగెత్తి ఎన్నికల్లో నామినేషన్
పశ్చిమ బెంగాల్‌లోని దార్జీలింగ్ జిల్లా సొనాడ గ్రామానికి చెందిన సనారా సుబ్బా అనే ఓ యువకుడు.. 22 కి.మీ.లు పరుగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. కొండ ప్రాంతంలో ఉన్న తమ ఊరిని రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోలేదని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు
* ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. ఐదు రోజుల్లో ఇది రెండోసారి
ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయంలోని రన్‌వేపై ల్యాండింగ్ సమయంలో ఇండిగో విమానం వెనుక భాగం నేలను తాకింది. అయితే ఆ తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సంఘటన కూడా కలవరపెడుతోంది ఎందుకంటే ఇండిగో విమానానికి గత 5 రోజుల్లో రెండవ సారి ఈ ప్రమాదం జరిగింది. అంతకుముందు జూన్ 1న కూడా కోల్‌కతా నుంచి వస్తున్న ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా టెయిల్ స్ట్రైక్ వచ్చింది.
* హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుంది: విద్యాసాగర్ రావు
హైదరాబాద్ నగరం మన దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. తాజాగా మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం హైదరాబాద్ కు ఉందని ఆయన అన్నారు. రాజ్యాంగంలో కూడా ఇదే అంశం ఉందని చెప్పారు. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలో కూడా అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని తెలిపారు
* పార్టీలకు అతీతంగా ఫిర్యాదులు స్వీకరించండి: కేటీఆర్
పౌరసేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకే వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. కాచిగూడలో వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో వార్డులో పది మంది అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలుకు మెరుగైన, సులభమైన సేవలు అందిస్తారని చెప్పారు.
* ఈనెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
తితిదే షెడ్యూల్ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్ 19న విడుదల చేయనుంది. భక్తులు https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని తితిదే తెలిపింది. సెప్టెంబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్ లక్కీ డిప్ కోసం జూన్ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.
* రాయలసీమ నుంచి ముందుకు కదలని రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలో అసాధారణ పరిస్థితులు
ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ నుంచి ముందుకు కదలడం లేదు. ఈ నెల 11న ఏపీలో ప్రవేశించిన రుతుపవనాలు అక్కడే నిలిచిపోయాయి. శ్రీహరికోట, కర్ణాటకలోని రత్నగిరి ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు నిలిచిపోయినట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని సగానికిపైగా ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు.
* ఎంపీ కుమారుడిని ఇంట్లో కట్టేసి కత్తితో బెదిరించారు: డీజీపీ
విశాఖపట్నం వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సతీమణి, కుమారుడు కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వారి నుంచి ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్నారు. కిడ్నాప్ ఘటనకు సంబంధించిన వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
* నెహ్రూ మెమోరియల్ మ్యూజియం పేరు మార్పు.. మండిపడ్డ కాంగ్రెస్
భారత తొలి ప్రధానమంత్రి జవహార్‌లాల్ నెహ్రూ (Jawaharlal Nehru) అధికారిక నివాసంగా ఉన్న తీన్‌మూర్తి భవన్ తాజా వివాదానికి కేంద్ర బిందువైంది. అందులో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (NMML) పేరును ప్రధానమంత్రుల మ్యూజియంగా మారుస్తూ (Prime Ministers’ Museum and Library Society) కేంద్రం నిర్ణయం తీసుకుంది.
* తృణధాన్యాలపై పాట.. గ్రామీ విజేతతో కలిసి మోదీ రచన, గాత్రం
తృణధాన్యాల (Millets) వల్ల కలిగే ప్రయోజనాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం గ్రామీ అవార్డు విజేత, ప్రముఖ భారత-అమెరికన్ గాయని ఫాల్గుణి షా (ఫాలు) ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. ఈ పాటకు భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) తన సహకారాన్ని అందించారు. గాయని ఫాలుతో కలిసి ఈ గీతాన్ని రచించడంతో పాటు తన గాత్రాన్ని కూడా అందించారు.
* ఫేస్‌బుక్ అకౌంట్ లాక్‌పై కోర్టుకు.. ₹41 లక్షల పరిహారం
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై (Facebook) ఓ వ్యక్తి న్యాయపోరాటానికి దిగాడు. అకారణంగా తన అకౌంట్‌ను (Facebook account) లాక్ చేయడమే కాకుండా.. సమస్యేంటో కనుక్కొందామని ఫోన్ చేస్తే పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో ఫేస్‌బుక్‌పై కోర్టులో దావా వేశాడు. ప్రతిగా రూ.41 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఘటన అమెరికాలోని జార్జియాలో జరిగింది.
* ఆ ₹లక్ష చోరీతో రైల్వేకు సంబంధం లేదు: 18 ఏళ్ల నాటి కేసులో సుప్రీం తీర్పు
రైలు ప్రయాణంలో వ్యక్తి పోగొట్టుకున్న డబ్బుతో రైల్వే (Railway)కు ఎలాంటి సంబంధం లేదని సుప్రీంకోర్టు (Supreme Court) తేల్చి చెప్పింది. ఈ కేసులో బాధిత ప్రయాణికుడికి పరిహారం చెల్లించాలన్న కన్స్యూమర్ కోర్టు ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. ఈ మేరకు 18 ఏళ్ల నాటి కేసులో కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
* కన్నపేగుకు నిరాశ.. ఆ పాప సంరక్షణ బాధ్యతలు జర్మనీకే!
చిన్నారి అరిహా కేసు (Baby Ariha Case)లో ఆమె తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది! ఆ పాప సంరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో జర్మనీ (Germany) అధికారులకే అప్పగిస్తూ బెర్లిన్ (Berlin)లోని ఓ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చిన్నారికి గాయం ప్రమాదవశాత్తుగా అయ్యిందన్న తల్లిదండ్రుల వాదనను తోసిపుచ్చుతూ.. ఆమె ప్రయోజనాలకు ముప్పు పొంచి ఉందని వ్యాఖ్యానించింది.
* ఆఫ్రికా నేతలు సందర్శిస్తున్న సమయంలో కీవ్‌పై క్షిపణి దాడులు..!
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంత్రి ప్రక్రియ కోసం చర్చలు జరిపేందుకు ఆఫ్రికా దేశాల నేతలు కీవ్‌కు వచ్చిన సమయంలో భారీగా దాడులు జరిగాయి. ఈ నేతల్లో కొందరు నగరంలో ఉన్న సమయంలో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. అదే సమయంలో నల్ల సముద్రంపై నుంచి రష్యా పలు కల్బిర్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ వాయుసేన వ్యాఖ్యానించింది.