దేశ రాజధానిలో ఉన్న నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధాన మంత్రుల మ్యూజియంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు మిసిస్ట్రీ ఆఫ్ కల్చర్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత తొలి ప్రధాన మంత్రి అధికారిక నివాసమైన తీన్మూర్తి భవన్లో ఎన్నో ఏళ్లుగా మ్యూజియం నిర్వహిస్తున్నారు. దీన్ని నెహ్రూ మెమోరియల్ మ్యూజిలయం అండ్ లైబ్రరీగా వ్యవహరిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలు నెహ్రూ పేరుతో కొనసాగిన ఈ మ్యూజియం పేరును తాజాగా ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మార్చారు.
దేశ తొలి ప్రధాని నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ వరకు ఎంతో మంది దేశానికి ప్రైమ్ మినిస్టర్లుగా సేవలు అందించారు. వారి పాలనా సమయంలో ఎదుర్కున్న సవాళ్లకు సంబంధించిన గుర్తులను ఈ మ్యూజియం తెలియజేస్తోంది. అందుకే పేరును మారుస్తూ చేసిన ప్రతిపాదనను స్వాగతిస్తున్నాను అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కాగా ఎన్ఎంఎంఎల్కు రాజ్నాథ్ సింగ్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తుండం గమనార్హం.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది బీజేపీ అల్పబుద్ది, నిరంకుశ మనస్తత్వాన్ని తెలియజేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఎలాంటి చరిత్ర లేని వారే.. ఉన్న చరిత్రను చరిపేస్తారని మండిపడ్డారు. 59 ఏళ్లకు పైగా అంతర్జాతీయ మేధో భాండాగారంగా విరాజిల్లుతూ, ఎన్నో విలువైన పుస్తకాలకు నిలయంగా ఉన్న మ్యూజియం పేరు మార్చడం తగదని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. మోడీ ప్రతీకారానికి, సంకుచిత మనస్తత్వానికి ఇది నిదర్శనం అన్నారు. ఇలాంటి ఒక అల్ప వ్యక్తి విశ్వగురువు అని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.