పాఠశాల చదువు పూర్తి చేసుకున్న అతగాడు.. ఏకంగా ఓ కంపెనీకి సీఈఓ అయ్యాడు. నలుగురికీ ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. అలాంటి వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ప్రముఖ జాబ్ సెర్చ్ వెబ్‌సైట్ లింక్డ్‌ఇన్ (LinkedIn) అతడిపై నిషేధం విధించింది. కారణం అతడి వయసు 15 ఏళ్లు కావడం! లింక్డ్‌ఇన్ నిబంధనల ప్రకారం ప్రొఫైల్ నిర్వహించాలంటే 16 ఏళ్లు ఉండాలట. గతంలో స్పేస్‌ఎక్స్‌కు చెందిన 14 ఏళ్ల ఇంజినీర్‌కు సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో లింక్డ్‌ఇన్ నిబంధనలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.అమెరికాకు చెందిన ఎరిక్ జూ (Eric Zhu) పాఠశాల విద్య పూర్తి చేసుకున్నాక ఏవియాటో సంస్థను స్థాపించాడు. వెంచర్ ఫండ్స్ కోసం అభివృద్ధి చేసిన స్టార్టప్ సెర్చ్‌ఇంజిన్ ఇది. ప్రస్తుతం ఈ సంస్థకు సీఈఓగానూ వ్యవరిస్తున్నాడు. అంతేకాదు బచ్‌మ్యానిటీ కేపిటల్‌లో ఇన్వెస్టర్‌గానూ ఉన్నాడు. తాను స్థాపించిన ఏవియాటోలో వయసులో అతడి కంటే పెద్దవారే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో లింక్డ్‌ఇన్ అతడి ప్రొఫైల్‌పై నిషేధం విధించింది. దీంతో కొందరు ఉద్యోగులు అతడికి మెసేజ్ చేస్తున్నా రిప్లయ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో అసలు విషయాన్ని ట్విటర్లో ఎరిక్ బయటపెట్టాడు.
‘కొత్తగా ఉద్యోగంలో చేరిన కొందరు ఉద్యోగులు నాకు మెసేజ్ చేస్తున్నారు. ‘నన్నెందుకు లింక్డ్‌ఇన్‌లో బ్లాక్ చేశారు’ అని అడుగుతున్నారు. నా వయసు 15 ఏళ్లే కావడంతో నన్ను లింక్డ్‌ఇన్ బ్లాక్ చేసింది. అందుకే మీరు నన్ను ట్యాగ్ చేయలేకపోతున్నారు’’ అని రాసుకొచ్చాడు. ఇదే విషయమై ఓ ఉద్యోగి ఆయనకు చేసిన మెసేజ్‌తో పాటు ఖాతా విషయంలో లింక్డ్‌ఇన్ ఉద్యోగితో జరిపిన సంభాషణలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సైతం జోడించాడు. దీంతో లింక్డ్‌ఇన్ నిబంధనలపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.