ఎంత బంగారు నగలైనా… వాడే కొద్దీ వాటికీ దుమ్మూ, మురికీ పట్టి… మెరుపును కోల్పోతాయి. అలాంటివాటిని శుభ్రం చేయించుకోవాలన్నా, మళ్లీ మెరుగు పెట్టించుకోవాలనుకున్నా నగల దుకాణానికి వెళ్లడం తప్పనిసరి. కానీ ఇప్పుడు అక్కడి వరకూ వెళ్లకుండా ఇంట్లోనే నగల్ని శుభ్రం చేసుకునేందుకు ‘అల్ట్రాసోనిక్ జ్యువెలరీ క్లీనర్’ వచ్చింది. చూడ్డానికి చిన్న పాత్రలా కనిపించే ఈ పరికరంలో నీళ్లు పోసి, నగల్ని వేసి టైమర్‌ని సెట్ చేస్తే చాలు. ఆ తరవాత వాటిని బయటకు తీసి ఈ పరికరంతోపాటు వచ్చే వస్త్రంతో తుడిస్తే… మురికీ, దుమ్మూ, జిడ్డూ పోయి నగలు అప్పుడే కొన్నట్లుగా, కొత్తవాటిలా మెరుస్తాయి. ఈ జ్యువెలరీ క్లీనర్‌లో సాధారణ బంగారు నగలే కాదు, వజ్రాలూ, విలువైన రాళ్లూ పొదిగినవీ వేయొచ్చు. అదేవిధంగా వాటర్ ప్రూఫ్‌వాచీల్నీ, కళ్లజోళ్ళనీ కూడా శుభ్రం చేసుకోవచ్చు.