తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 129వ రోజుకి చేరింది.ఈ సందర్భంగా యానాదులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. వైకాపా అధికారంలోకి రాగానే యానాదుల సంక్షేమ పథకాలను నిలిపివేసిందని లోకేశ్ దుయ్యబట్టారు. తెదేపా అధికారంలోకి వస్తే యానాదులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం లాక్కొన్న భూములను తిరిగి ఇస్తామన్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే రోడ్లు వేస్తామని చెప్పారు. యానాదుల కోసం కమ్యూనిటీ భవనాలు కట్టిస్తామని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
వైకాపా పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయని మండిపడ్డారు. పేదరికం లేని సమాజం తీసుకురావాలంటే అభివృద్ధి, సంక్షేమం అవసరమన్నారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇవ్వాలనే పథకం అమలు చేసేందుకు గతంలో ఏర్పాట్లు చేశామని.. ఈలోపే ప్రభుత్వం మారిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శ్మశానాల అవసరం ఉందని అడుగుతున్నారన్నారు. తెదేపా హయాంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, అనేక సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నియంత్రించి.. జగన్ బ్రాండ్లను తరిమి కొడతామన్నారు.