Politics

అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ సోమవారం సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది. మే 31న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఈనెల 13న ఈ కేసు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు సీనియర్‌ న్యాయవాదులకు వాదించే అవకాశం ఇవ్వకపోవడంతో పిటిషనర్‌ సునీతే సొంతంగా వాదనలు వినిపించారు. అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని కోరడంతో పాటు దర్యాప్తు గడువును జూన్‌ 30 నుంచి మరికొంత కాలం పొడిగించాలని కోరారు. సాంకేతిక అంశాలు ఇమిడి ఉన్న ఈ కేసులో సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతూ ఆ ధర్మాసనం విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఆ నేపథ్యంలో సోమవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.