మనదేశంలో నాగుపాములను నాగదేవతలుగా పూజిస్తారు. అందుకే దానిచుట్టూ కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వచ్చాయి. కాని మన శాస్త్రాల ప్రకారం నాగులు, సర్పాలు ఒకటి కావు. నాగులు వేరు, సర్పాలు వేరు.
▶ భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పినదానిని పరిశీలిస్తే.. ‘నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. సర్పాలలో వాసుకిని, నాగులలో అనంతుడిని అంటాడు.
▶వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి, అనంతుడు ఇద్దరూ కద్రువ తనయులు. అనంతుడు అనగా ఆదిశేషుడు… కద్రువకు పెద్ద కొడుకు. బ్రహ్మ అనంతుడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు.
▶పురాణాల ప్రకారం అనంతుడు
అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు.
▶ఇక్కడే ఓ సందేహం వస్తుంది. విష్ణుమూర్తేమో.. సర్పాలలో వాసుకిని తానేనన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడిని అంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి వీటి మధ్య తేడా అన్న అనుమానం వస్తుంది. కొంతమంది ప్రాజ్ఞుల అవగాహన ప్రకారం… సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు.
▶కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెండింటికీ తేడా ఉంది.
▶నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నయినా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి. భూమి మీదే తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్టత వుంది. అవి గాలిని ఆహారంగా స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలు మాత్రం.. కప్పలు మొదలైన జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి.
నాగుల్లో మళ్ళీ జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతా సర్పాలని లేదా నాగులని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుందంటారు. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. దేవతా సర్పాలకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయి. అవి పాలు త్రాగుతాయి. పూర్వకాలంలో ప్రజల భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో వారికి దర్శనమిచ్చి పూజలు అందుకునేవారంటారు. భక్తుల కోరిక మేరకు ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహించేవి.
కాలచక్రంలో తిథులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవి. అప్పటి మనుషులకు ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఎక్కువగా ఉండేవి. ఆ రోజులు వేరు. అందుకే అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపు కుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమ క్రమంగా ప్రజల్లో ధర్మంపై శ్రద్ధ తగ్గిపోయింది. అందుకే నాగులు ఇంతకముందులా సశరీరంతో సంచరించడం మానేశాయి.
దాదాపు 100 ఏళ్ళ క్రితం వరకు దేవతా సర్పాలను చూసి, పూజించి వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సదాచారం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేస్తున్నారు.
ఒకవేళ ఇటువంటి ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నా అత్యంత నిష్టంగా పాటించే వారు అరుదుగా కనిపిస్తున్నారు. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. భూలోకంలోని లోపాల వల్ల కొన్ని.. శరీరాలను విడిచిపెట్టాయి. ఇక పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం. చాలావరకు మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ హింసించకూడదు. ఇలా చేస్తే……. దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చును.
▶నాగులు, సర్పాలలో ఉండే వైవిధ్యాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం.
▶సకల చరాచర సృష్టిలో సర్పాలకు, నాగులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. చాలా దేశాలలో నాగారాధన, సర్పారాధన కూడా కలదు.
▶ ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.
సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు రకాలుగా ఉన్నాయి. అవి
1 . దివ్యములు :
ఇవి దేవతా సర్పములు . వీటినే నాగులు అని కూడా అంటారు.
2 . భౌమములు :
ఇవి భూమి నందు ఉండునవి .
దివ్య సర్పములు లేదా నాగులలో భూమి యందు తిరిగే
సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.
దివ్య సర్పములలో లేదా నాగులలో రకాలు –
1 . అనంతుడు
2. వాసుకి.
3 . తక్షకుడు.
4. కర్కోటకుడు .
5 . పద్ముడు .
6 . మహాపద్ముడు .
7 . శంఖపాలుడు .
8 . కులికుడు .
▶దేవతా సర్పములకు లేదా నాగులకు ఉండు గుర్తులు –
అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును. కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల
వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును.
పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.
అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరా మరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషధం ఏమియూ లేదు . కొన్ని సార్లు ఇవి అదృశ్య రూపంలో కూడా ఉంటాయి.
భూమి యందు ఉండు సర్పముల భేదములు.
1 – ఉపజాతి సర్పములు .
2 – దర్వీకరములు .
3 – మండలీ సర్పములు .
4 – రాజీమంతములు .
అను నాలుగు రకముల సర్పములు కలవు.
భౌమ సర్పముల యొక్క లక్షణములు –
పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును.
భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య –
1 – దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు.
2 – మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు.
3 – రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.
ఇలా విశ్లేషణకు వెళితే ఇంకా ఉంది……