Agriculture

ఇక రిజిస్ట్రేషన్లకు ఈ-స్టాంపులు

ఇక రిజిస్ట్రేషన్లకు ఈ-స్టాంపులు

ఇకపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లు వంటి వాటి కోసం దస్తావేజులు (నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంపులు) వినియోగిం­చాల్సిన అవసరం లేదు. ఈ–స్టాంపుల ద్వారా ఈ పనులన్నింటినీ చేసుకునే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంటే రూ.100, రూ.50 ఇతర నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంపులను స్టాంప్‌ వెండర్ల వద్ద కొనక్కర్లేదు. ప్రభుత్వం అనుమతించిన కామన్‌ సర్విస్‌ సెంటర్లలో ఎంత డినామినేషన్‌ కావాలంటే అంతకి ఈ–స్టాంపులను సులభంగా పొందొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ–స్టాంపింగ్‌ విధానం పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఈ–­స్టాంపుల ద్వారా ట్యాంపరింగ్‌కు, అవకతవకలకు ఆస్కారం ఉండదు.

Nagababu news updates.

1,200 కామన్‌ సర్విస్‌ సెంటర్లకు అనుమతి
మొదట్లో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల (అగ్రిమెంట్లు వంటివి) కోసం ఈ–స్టాంపింగ్‌ను అనుమతించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు సైతం ఈ–స్టాంపింగ్‌ను ప్రభుత్వం అనుమతించింది. ఇందుకోసం 1,200 కామన్‌ సర్విస్‌ సెంటర్లు (ఆథరైజ్డ్‌ సర్వీస్‌ సెంటర్లు (ఏసీసీ)–మీ సేవా కేంద్రాలు వంటివి), 200 మంది స్టాంప్‌ వెండర్లకు ఈ–స్టాంపింగ్‌ చేసేందుకు లైసెన్సులు ఇచ్చింది.

ప్రతి సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఈ–స్టాంపింగ్‌కి సంబంధించి ఒక కౌంటర్‌ను ప్రారంభిస్తోంది. ఏసీసీ సెంటర్లు అందుబాటులో లేనివారు, వాటి గురించి తెలియని వారు నేరుగా ఆ కేంద్రాల వద్ద కెళ్లి ఈ–స్టాంపులు పొందొచ్చు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఈ–స్టాంపింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి దశలో మండల కేంద్రాల్లో ఉన్న సచివాలయాల్లో తేవడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే 30 శాతం రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్‌ ద్వారానే..
ఇప్పటికే నెల నుంచి ఈ–స్టాంపింగ్‌ విధానం ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటే అందులో 30 శాతం ఈ–స్టాంపుల ద్వారానే జరుగుతున్నట్లు ఈ విధానాన్ని పర్యవేక్షిస్తున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాస్‌ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో 70 శాతానికిపైగా రిజిస్ట్రేషన్లు ఈ–స్టాంపింగ్‌ ద్వారానే జరిగేలా చూసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

దస్తావేజుల కంటే ఎక్కువ భద్రత
నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంపు పేపర్ల కంటే ఈ–స్టాంపులకు ఎక్కువ భద్రత ఉంటుంది. వీటిని ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యం. పాత తేదీల మీద స్టాంపులు విక్రయించే అవకాశం ఉండదు. దస్తావేజుల వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉండేది కాదు. కానీ ఈ–స్టాంపింగ్‌ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ ఆదీనంలోనే ఉంటుంది. ప్రజలు మోసపోవడానికి ఆస్కారం ఉండదు. గతంలో మాదిరిగా దస్తావేజులను అధిక ధరలకు కొనే బాధ కూడా తప్పుతుంది.

ఏసీసీ సెంటర్‌కి వెళితే అక్కడ ఒక దరఖాస్తు పూర్తి చేస్తే చాలు.. ఈ–స్టాంపు ఇస్తారు. నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల మాదిరిగా రూ.100, రూ.50, రూ.20, రూ.10 ఎంత డినామినేషన్‌ అయినా ఈ–స్టాంపుల ద్వారా పొందొచ్చు. సుమారు రూ.రెండు లక్షల డినామినేషన్‌ వరకు ఈ–స్టాంపులు జారీ చేసే అవకాశాన్ని కల్పించారు. పలు బ్యాంకులు సైతం ఈ–స్టాంపింగ్‌కి అనుమతి తీసుకుంటున్నాయి.

వినియోగదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్టాంప్‌ డ్యూటీ, ఇతర చార్జీలను కూడా ఇకపై బ్యాంకుల్లో చలానాలుగా కాకుండా ఈ ఏసీసీ కేంద్రాల్లోనే చెల్లించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ–స్టాంపింగ్‌ విధానాన్ని స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది.

ఈ–స్టాంపులతో ఎంతో మేలు
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రిజిస్ట్రేషన్ల శాఖలో ఈ–స్టాంపుల విధానాన్ని ప్రవేశపెట్టాం. దస్తావేజుల స్థానంలో ప్రజలు వీటిని వినియోగించుకోవచ్చు. నాన్‌–జ్యుడిషియల్‌ స్టాంపుల కంటే వీటికే భద్రత ఎక్కువగా ఉంటుంది. ఏసీసీ కేంద్రాలు అందుబాటులో లేని వారు తమకు సమీపంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లి ఈ–స్టాంపింగ్‌ అవకాశాన్ని పొందొచ్చు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది.