తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో 9వ విడత హరిత హారంలో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో హరితహారంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటనున్నారు. ఈ క్రమంలో సిఎం కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ఎంపి రంజిత్ రెడ్డిలు ఆదివారం తుమ్మలూరును సందర్శించి అక్కడే ఉన్నతాధికారులతో సమీక్షించారు. సిఎం పాల్గోనే ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సిఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సిఎం ఓఎస్‌డి ప్రియాంక వర్గీస్, అటవీశాఖ పిసిసిఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, సిపి సత్యనారాయణ పాల్గొన్నారు.
9వ విడతను హరితహారంను సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం ప్రజల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు ఇస్తోందని అటవీ , పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇదే స్పూర్తితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సోమవారం నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాల్గొననున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్టు పార్కులో ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కలు నాటనున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. ఇదే స్పూర్తితో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే హరితోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో పుడమి తల్లి పులకించేలా.. ప్రకృతి పరవశించేలా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని ఆయన సూచించారు. అదే విధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనం పెరగడానికి చేసిన కృషి వాటి ఫలితాల గురించి ప్రజలకు వివరించాలన్నారు.