అమెరికాలో మళ్లీ కాల్పుల మోత కలకలం రేపింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని విల్లో బ్రూక్‌లో జరుగుతునన జూన్ టీన్త్ వేడుకల్లో గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు జరిపారని స్థానిక మీడియా కథనం. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో 20 మందికి గాయాలయ్యాయని డ్యూపేస్ కౌంటీ డిప్యూటీ పోలీసు అధికారి ఎరిక్ స్వాన్ సన్ మీడియాకు చెప్పారు.క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించారు. గాయపడిన వారిలో పది మందికి తీవ్రంగా గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అమెరికా మీడియా వర్గాలు తెలిపాయి. తీవ్రంగా గాయపడిన 10 మంది వ్యక్తులను నాలుగు దవాఖానలకు తరలించారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఆగంతకులు ఎందుకు కాల్పులు జరిపారన్న సంగతి తెలియరాలేదు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరిగినట్లు తెలుస్తున్నది. వేడుక జరిగిన విల్లో బ్రూక్ పార్కింగ్ ఏరియా వద్ద దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం.