పాక్ ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఐఎంఎఫ్ ప్యాకేజీ కోసం వేచి చూస్తోంది. అయితే, ఈ తరుణంలో పాక్ నుంచి పలు అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపివేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం యూకే ఆయిల్ కంపెనీ ‘షెల్’ పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయింది. తాజాగా, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా సైతం తన తయారీ యూనిట్లను షట్ డౌన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై టయోటా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
టయోటా ఇండస్ మోటార్స్ పాకిస్తాన్‌కి చెందిన తన తయారీ ప్లాంట్‌ను శాస్వతంగా మూసేసింది. దేశం విడిచి పెట్టి వెళ్లిపోనుంది అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయంటూ బలోచిస్తాన్ జర్నలిస్ట సఫర్ ఖాన్ ట్వీట్ చేశారు. టయోటా ఇండస్ పాకిస్థాన్‌లో తన కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వచ్చిన నివేదికపై స్టాక్ వ్యాపారి జెహాన్‌జేబ్ నవాజ్ వివరణ కోరారు. “వార్తలు సరైనవి అయితే, ఇప్పటికే బుక్ చేసిన కార్ల పరిస్థితి ఏమిటి? ముందస్తు చెల్లింపులు, డీలర్‌షిప్‌ల గురించి చెప్పాలని తెలిపారు.ఈ నెల ప్రారంభంలో, ఏఆర్‌వై న్యూస్ ప్రకారం.. కంపెనీ సరఫరా గొలుసులో అంతరాయం కారణంగా టయోటా ఇండస్ మోటార్స్ ఉత్పత్తిని నిలిపివేసింది. పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జనరల్ మేనేజర్‌కు రాసిన లేఖలో, కంపెనీ మేనేజ్‌మెంట్ “లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (LC) తెరవడంలో జాప్యం, ఇన్వెంటరీ కొరత” కారణంగా దాని ఉత్పత్తిని మూసివేస్తున్నట్లు పేర్కొంది.
కంపెనీ తన ఉత్పత్తిని నిలిపివేయడం ఇది రెండోసారి. గత ఏడాది డిసెంబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) నుండి దిగుమతి అనుమతులలో జాప్యం కారణంగా కంపెనీ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ఆటో మొబైల్ రంగానికి సీకేడీ కిట్‌లు, ప్యాసింజర్ కార్ల విడిభాగాల దిగుమతికి ముందస్తు అనుమతి పొందేందుకు పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ కొత్త మెకానిజంను ప్రవేశపెట్టిందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు టయోటా శాస‍్వతంగా మూసివేస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి రావడంపై పాక్ ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా అసలే ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతున్న ఈ కఠిన సమయంలో అంతర్జాతీయ కంపెనీలు తరలి వెళ్లడం.. దేశ ఎకానమీకి మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.