Politics

పంజాబ్ సీఎంపై కేంద్రమంత్రి అమిత్ షా కామెంట్స్

పంజాబ్ సీఎంపై కేంద్రమంత్రి అమిత్ షా కామెంట్స్

పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అమిత్ షా పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌పై విరుచుకుపడ్డారు. భగవంత్ మాన్ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు ట్రావెల్ ప్లానర్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. భగవంత్ మాన్ పంజాబ్ కు ముఖ్యమంత్రిగా కాక కేజ్రీవాల్ కు పైలట్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడితప్పి ప్రజలు అవస్థలు పడుతుంటే పట్టించుకోకుండా కేజ్రీవాల్ వెంట తిరుగుతున్నారని మాన్ పై ఫైర్ అయ్యారు.ప్రజా పాలన వదిలేసి కేజ్రీవాల్ తో చెన్నయ్ కు వెళ్లాలా లేక కోల్ కతా వెళ్లాలా లేక ఢిల్లీ వెళ్లాలా అనే దానిమీద భగవంత్ మాన్ శ్రద్ధ చూపిస్తున్నారని సైటైర్లు వేశారు. కేజ్రీవాల్ కు సంబధించిన ప్రయాణాల గురించి చూడటానికే మాన్ కు సమయం సరిపోతలేదని.. ఇక ప్రజల గురించి పట్టించుకునే తీరిక ఎక్కడిదని ఎద్దేవా చేశారు. ఇవన్నీ చూస్తుంటే మాన్ ముఖ్యమంత్రియా లేక కేజ్రీవాల్ కు పైలటా అనేది తనకు అర్థం కావడం లేదని అమిత్ షా అన్నారు.