మాసబ్ ట్యాంక్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ భవన్‌లో బాంబు ఉందని ఫేక్ కాల్ చేసిన వ్యక్తిని సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన జైని రాధాకృష్ణ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అధికంగా పన్నులు వసూలు చేస్తుందని భావించి వారి నుంచి ఎలాగైనా డబ్బులు రాబట్టాలని పథకం వేశాడు. ఈ క్రమంలో ఈనెల 11న హయత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి డయల్ 100కు ఫోన్ చేసి ఇన్‌కమ్ ట్యాక్స్ టవర్స్‌లో బాంబు పెట్టామని బెదిరించాడు. బాంబు పేలకుండా ఉండాలంటే తనకు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే బాంబ్ స్క్వాడ్ సహాయంతో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఉద్యోగులను బయటికి పంపించి కార్యాలయమంతా గాలించారు. ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఓ ఆకతాయి పనే అయ్యి ఉండొచ్చని భావించిన పోలీసులు దాన్ని ఫేక్ కాల్‌గా తేల్చారు. చివరకు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టి రాధాకృష్ణను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.