సైబర్ నేరగాళ్ల మోసాలు పెరిగిపోతున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం విద్యావంతులే ఉంటున్నారు. చేతులు కాల్చుకున్న తర్వాత లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఒక రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి రూపాయలకు పైగా అమాయకుల నుంచి దోచేస్తున్నారు. ఈ నేరాల్లో.. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలే 80 శాతానికి పైగా ఉన్నాయి. గతంలో ఈ తరహా నేరాలపై హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మాత్రం రాచకొండ కమిషనరేట్‌లో కూడా భారీగానే కేసులు నమోదవుతున్నాయి.
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, క్రిప్టో కరెన్సీ పేరుతో బాధితులకు ఆశ చూపిస్తున్న నేరగాళ్లు నిండుగా ముంచేస్తున్నారు. మొదట్లో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించడం.. వాటికి లాభాలిస్తూ బాధితులను ఈజీగా బుట్టలో పడేస్తున్నారు. అంతేగాకుండా.. నేరగాళ్లు తమ టీమ్‌లో స్థానికులను కూడా చేర్చుకుంటున్నారు. ఇప్పుడు హిందీ, ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా నేరగాళ్లు మాట్లాడుతూ ఈజీగా బాధితులను ముంచేస్తున్నారు. అయితే, నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో ఎక్కువ శాతం విద్యావేత్తలే ఉంటున్నారు. శనివారం రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో నమోదైన కేసుల్లో సైబర్ నేరగాళ్లు కోటి రూపాయల వరకు తమ చేతి వాటాన్ని చూపించారు.
లేమూర్, రాంకీ డిస్కవరి సిటీ విల్లాలో నివాసముండే ప్రైవేట్ ఉద్యోగికి ఈనెల ఒకటిన వాట్సాప్ నంబర్‌కు +212670257019 నుంచి పార్ట్‌టైమ్ జాబ్‌లు ఉన్నాయంటూ మెసేజ్ వచ్చింది. హోటల్స్, రెస్టారెంట్స్‌కు రేటింగ్ ఇవ్వడమే ఉద్యోగమని, టెలిగ్రామ్ ఐడీలోకి జాయిన్ చేశారు. అది నిజమని నమ్మిన బాధితుడు మొదట ఒక రేటింగ్‌కు రూ. 50 చొప్పున డిపాజిట్ చేసి, మూడు రేటింగ్‌లకు రూ.150 సంపాదించాడు. ఆ తరువాత ఒక లింక్‌ను పంపించారు. అందులో మీరు రిజిస్టర్ కావాలంటూ సూచించారు. ఆ తరువాత మీకు ఇప్పటి నుంచి ప్రీ పెయిడ్ టాస్క్‌లుంటాయని, కొంత మొత్తం పెట్టుబడిగా పెడుతూ వెళ్తుంటే టాస్క్‌లలో భారీగా సంపాదించుకోవచ్చని సూచించారు. నేరగాళ్ల సూచన మేరకు దఫ దఫాలుగా రూ. 21,37,650 పెట్టుబడి పెట్టినా, ఒక్క పైసా కూడా తిరిగి రాకపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
చౌటుప్పల్ మండలానికి చెందిన ఒక వ్యాపారికి మే నెలలో టిండర్ యాప్ ద్వారా ఒక యువతి మెసేజ్ పంపించింది. వాట్సాప్‌లో చాటింగ్ చేసింది. క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలున్నాయంటూ నమ్మించింది. ఈ క్రమంలోనే బాధితుడితో రూ.17 వేలతో బియాన్స్ యాప్‌లో ఇన్వెస్ట్ చేయించింది. ఆ తరువాత యూఎస్‌డీటీ బాగుందని ఎం.బిట్‌కాక్స్.కామ్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయంటూ నమ్మించింది. కొంత మొత్తం పెట్టుబడి పెట్టడంతో అందులో లాభాలు వచ్చాయి. దీంతో ఆ వెబ్‌సైట్‌పై నమ్మకం కుదిరింది. ఇక దఫ దఫాలుగా రూ. 48 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అయితే, మొదట నమ్మకంగా లాభాలిచ్చి, ఆ తరువాత ఆ యాప్‌లో స్క్రీన్‌పై లాభాలు కనిపించినా, వాటిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును తొలగించారు. అయితే, స్క్రీన్‌పై కనిపించే లాభాలు ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చంటూ నేరగాళ్లు సూచించారు. వారి మాటలు నమ్మిన బాధితుడు భారీగా పెట్టుబడి పెట్టి మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
దమ్మాయిగూడకు చెందిన గృహిణికి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. ట్రావెలోక్ యాప్‌కు రేటింగ్ ఇవ్వడమే పార్ట్‌టైమ్ ఉద్యోగమని మెసేజ్‌లో ఉంది. దీంతో పాటు సూపర్‌సర్వర్.కామ్ పేరుతో ఒక లింక్ పంపించి అందులో కొన్ని టాస్క్‌లుంటాయని, ఆ టాస్క్‌లు పూర్తి చేస్తూ వెళితే మీకు లాభలొస్తాయంటూ నమ్మించారు. మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టగానే లాభాలిచ్చారు. అనంతరం పెట్టుబడి పెంచుతూ వెళ్లడంతో లాభాలు ఆపేశారు. దఫ దఫాలుగా రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.