రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వానకాలం రైతుబంధు నిధుల విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. జూన్ 26 నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్.
ఇక, ఈ నెల 24 నుండి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సర్కార్ డెసిషన్ తీసుకుంది. పట్టాల పంపిణీ తర్వాత పోడు రైతులకూ రైతుబంధు సాయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్ధికశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రైతుల పెట్టుబడికి ఇబ్బంది లేకుండా వారికి సాయం అందించే విధంగా రైతుబంధు తీసుకొచ్చారు కేసీఆర్.గతంలో రైతుబంధు పొందిన వారితో పాటు కొత్తగా పాస్ బుక్ వచ్చిన వారికి ఈసారి రైతుబంధు అందనుంది. మొదట తక్కువ భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న వారికి రైతుబంధు డబ్బు ఇవ్వనున్నారు.
2018 వానకాలం సీజన్ నుంచి కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏటా రెండు సీజన్ల చొప్పున.. ఇప్పటివరకు 9 సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.10 వేలు అందిస్తుంది ప్రభుత్వం. వానకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి 5 వేల చొప్పున మొత్తం రూ.10వేలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వానకాలానికి సంబంధించి ఎకరాకు రూ.5 వేల చొప్పున సాయం చేయనున్నారు. ఈసారి రైతుబంధు అందుకునే వారి సంఖ్యతో పాటుగా డబ్బు కూడా పెరిగే అవకాశాలున్నాయి.
అన్ని అర్హతలు ఉన్నా.. రైతుబంధు రాకపోతే ఆయా గ్రామాల AEOలకు పట్టా పాస్ బుక్, బ్యాంకు అకౌంట్, ఆధార్ కాపీలను అందజేస్తే ఈసారి రైతుబంధు వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు