టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నేడు వెంకటగిరి నియోజకవర్గం అకిలివలస గ్రామస్తులతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రజలు మరో 10 నెలలు ఓపిక పడితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. గంజాయి స్మగ్లర్లను పోలీసులు వదిలేస్తున్నారని ఆరోపించారు. వాహనాలకు చలాన్లు వేయడమే పోలీసులకు ప్రధాన విధిగా మారిందని విమర్శించారు. ఆటోవాలాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ ఆటోల కోసం ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ నిధులతో అకిలివలసలో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. “పేదలందరికీ ఇళ్లు కట్టిస్తానని జగన్ గతంలో చెప్పారు… ఇప్పుడు ఇల్లు మీరే కట్టుకోండని చెబుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుంది” అని లోకేశ్ స్పష్టం చేశారు.