తనను అరెస్టు చేసి జైల్లో పెట్టినా లొంగిపోయే ప్రసక్తే లేదని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు, ప్రజల కోసం తాను పోరాటం చేస్తున్నానని ఉద్ఘాటించారు. అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతోన్న ఆయన.. దేశంలో న్యాయపాలన కోసం తన పోరాటం కొనసాగుతుందన్నారు.‘నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినాసరే.. నేను మాత్రం వాళ్లతో రాజీపడను, లొంగిపోను. దేశంలో న్యాయపాలన కోసం పోరాటాన్ని కొనసాగిస్తా’ అని తనను మద్దతుదారులను ఉద్దేశిస్తూ ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుపట్టిన ఆయన.. తనను వ్యక్తిగతంగా కలిసిన వారిపై అక్రమంగా కేసులు నమోదు చేసి ఆర్మీ కోర్టుల్లో విచారణ జరుపుతున్నారని మండిపడ్డారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్‌పై దాదాపు 140 కేసులు ఉన్నాయి. ఉగ్రవాదం, హింసకు ప్రేరేపించడం, దహనకాండ, హత్యాయత్నం, అవినీతి, మోసానికి సంబంధించిన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా 19 కేసుల్లో ఇప్పటివరకు ఉన్న ముందస్తు బెయిల్ పొడిగింపు కోసం సోమవారం ఉదయం ఆయన లాహోర్ నుంచి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. ఇదిలాఉంటే, మే 9న ఇమ్రాన్ ఖాన్ అరెస్టు అనంతరం పీటీఐ కార్యకర్తలు, పార్టీ మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. దాదాపు 20సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు 10వేల మంది పీటీఐ పార్టీ కార్యకర్తలను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినట్లు అంచనా. ఇదే సమయంలో మరికొన్ని కేసుల్లో ఇమ్రాన్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.