రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్ (DG)గా స్వామినాథన్ జానకిరామన్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ (ACC) మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మూడేళ్ల కాలవ్యవధికి నియామకం జరిగింది. స్వామినాథన్ జానకిరామన్ ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మేనేజింగ్ డైరెక్టర్ (MD)గా ఉన్నారు. ప్రస్తుత ఆర్‌బీఐ డీజీ ఎంకే జైన్ పదవీకాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో జానకిరామన్ నియామకం జరిగింది.కేంద్ర ప్రభుత్వం జూన్ 1న ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్ పదవికి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. యూనియన్ బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసన్ వరదరాజన్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజింగ్ డైరెక్టర్, CEO AS రాజీవ్.. UCO బ్యాంక్ MD, CEO సోమ శంకర ప్రసాద్.. ఇండియన్ బ్యాంక్ MD, CEO SL జైన్ ఈ పోస్ట్ కోసం ఇంటర్వ్యూ చేసిన ఇతర అభ్యర్థులలో ఉన్నారు. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్, క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా, ఆర్థిక సేవల కార్యదర్శి, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (CEA) వి అనంత నాగేశ్వరన్‌లతో కూడిన ప్యానెల్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసింది. డిప్యూటీ గవర్నర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్చి 19న దరఖాస్తులను ఆహ్వానించింది.