Politics

ఎమ్మెల్యేల రిపోర్టుపై సీఎం అసంతృప్తి: జగన్

ఎమ్మెల్యేల రిపోర్టుపై సీఎం అసంతృప్తి: జగన్

గడప గడపకు మన ప్రభుత్వం. కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు సమీక్ష చేశారు సీఎం జగన్. అయినా, కొందరు ఎమ్మెల్యేల తీరు ఏమాత్రం మారట్లేదు. ఇంట్లో నుంచి బయటకే రావడం లేదు. ఏ ఇంటి గడపా తొక్కడం లేదు. అలా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు డుమ్మా కొడుతున్నారని జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అలాంటి నేతలంతా తీరు మార్చుకోకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. త్వరలోనే వారిని పిలిపించి మాట్లాడుతానని అన్నారు.

గ్రాఫ్ బాగుంటేనే టికెట్.. ఇది సీఎం జగన్ సూటిగా చెప్పిన మాట. పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లతో వర్క్‌షాప్ నిర్వహించారాయన. ముఖ్యంగా 10, 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని.. వైఖరి మార్చుకోవడం లేదని తేల్చి చెప్పారు. వాళ్ల పేర్లు ఓపెన్‌గా చెప్పడం బాగుండదు కాబట్టి.. వాళ్ల రిపోర్టులను నేరుగా వాళ్లకే పంపిస్తానంటూ తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌లో ఐప్యాక్ టీమ్ సర్వే చేస్తుందని.. ఆ రిపోర్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు జగన్ మోహన్ రెడ్డి.

ఎండాకాలం కారణంగా గడపగడపకు కార్యక్రమాన్ని కొందరు సీరియస్‌గా తీసుకోలేదని సమర్థిస్తూనే… వచ్చే నెల నుంచి సీరియస్ తీసుకోవాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. గడపగడపకు వెళ్తేనే మీ గ్రాఫ్‌ పెరుగుతుంది.. అప్పుడే టికెట్ కన్ఫామ్ అవుతుందని తేల్చేశారు. తీరు మార్చుకోకుంటే టికెట్ ఉండదని కుండబద్దలు కొట్టారు జగన్ మోహన్ రెడ్డి. వచ్చే 9 నెలలు మనకు చాలా కీలకమని చెప్తూనే.. పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రలను పెద్దగా పట్టించుకోవద్దని జగన్ మోహన్ రెడ్డి సూచించారు.

మరో 9 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని.. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని జగన్ చెప్పారు. ఎన్నికల్లో తప్పని సరిగా గెలిచేందుకు అంతా కష్టపడి పనిచేయాలని పిలుపు ఇచ్చారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను కొనసాగిస్తే.. అది పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని హెచ్చరించారు.ఈనెల 24 నుంచి నెల రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహణపై.. నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 11 రకాల ధ్రువపత్రాలు కావాల్సిన వారి వివరాలు తీసుకుని వెంటనే వాటిని జారీ చేసేలా పర్యవేక్షించాలని సూచించారు జగన్.