Politics

రేపు సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్

రేపు సంగారెడ్డి జిల్లాకు  కేసీఆర్

ఆసియాలోనే అతిపెద్ద డబుల్‌ బెడ్రూం ఇండ్ల సముదాయానికి సీఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం సీఎం కేసీఆర్‌ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. పటాన్ చెరులో రూ.183కోట్ల పటాన్ చెరులో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారని, నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ పరిశ్రమను ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని, వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో పరిమిత సంఖ్యలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే సంగారెడ్డికి వైద్య కళాశాల ఇచ్చి దశాబ్దాల కోరికను నెరవేర్చారని, కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30శాతం ఉన్న ప్రసవాల శాతం ఇప్పుడు 81శాతానికి పెరిగిందన్నారు. పటాన్ చెరుకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడంతో ఈ ప్రాంతానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని తెలిపారు. 21రోజుల పాటు జరిగిన దశాబ్ది ఉత్సవాలను ప్రజలు స్వచ్ఛందంగా విజయవంతం చేశారని, కాంగ్రెస్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోందని మంత్రి మండిపడ్డారు.

దశాబ్ది ఉత్సవాలను కాంగ్రెస్ దగా కార్యక్రమంగా నిర్వహించి అమరులను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీది పైశాచిక ఆనందమని, ప్రజలు సంతోషంగా ఉంటే జీర్ణించుకోలేకపోతుందని ఆరోపించారు. అభివృద్ధి చరిత్ర బీఆర్‌ఎస్‌దని, అవరోధాల చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు. రాజీనామాల చరిత్ర బీఆర్‌ఎస్‌దని, రాజీల చరిత్ర కాంగ్రెస్‌ది అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆచరిస్తది.. దేశం అనుసరిస్తది అన్నట్లుగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మార్చారని, కాంగ్రెస్ పాలన అంటే.. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అంటూ ఎద్దేవా చేశారు.ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నాడు తుపాకీ పట్టుకుని ఉద్యమ నాయకుల మీదకు వెళ్లలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన నాడు 17వేలు ఉన్న వైద్య విద్య సీట్లను నేడు 50వేలకు తీసుకెళ్లామని, కాంగ్రెస్ పార్టీ హయాంలో 20 సంవత్సరాలకో మెడికల్ కాలేజీ తీసుకొస్తే.. ఒకే సంవత్సరంలో తొమ్మిది మెడికల్‌ కాలేజీలు తీసుకువచ్చామన్నారు. పెళ్లి మంత్రం చదవమంటే.. చావు మంత్రం చదివినట్లు ఉంది కాంగ్రెస్‌ తీరు అంటూ విమర్శలు గుప్పించారు. ఉద్యమకారులను చిన్న బరిచే విధంగా కాంగ్రెస్ తీరుందని, కాంగ్రెస్ తన తీరుతో ప్రజలకు దూరం అవుతోందని, కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.