Politics

హిందీ భాషపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్

హిందీ భాషపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్

ఎవరి భాష వాళ్లకు ఉంటుందని, కానీ ఒకరిపై ఒకరు పెత్తనం చేసుకునే అవసరం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హిందీ భాష ఇష్టమైనది కూడా అన్నారు. హిందీ పాటల్లో పదాలు అద్భుతంగా ఉంటాయన్నారు. అయితే, సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాదిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో బుధవారం తెలంగాణ సాహిత్య సభలు ప్రారంభమయ్యాయి.ఆచార్య ఎన్‌.గోపికి ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను అందజేసి స‌త్కరించారు. స్వర్ణ కంకణంతో పాటు రూ.1,0,1116 అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయత అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగానే తెలంగాణ జాగృతి భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని చెప్పారు.

తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవడం అంతే ముఖ్యమన్న నినాదంతో ఉద్యమం చేశామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సాహిత్య వికాసాన్ని, సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవడంతో పాటు తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ వాళ్లు మరింత పరిపుష్టం చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహితీ సభలను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఏటా తెలంగాణ సాహిత్య సభలు జరుపుతామని ప్రకటించారు.నందిని సిద్దా రెడ్డి తెలంగాణ భాషలో మంచి కవిత్వాన్ని రాశారని, ఉద్యమంలో అందరికీ అండగా నిలబడ్డారని తెలిపారు. నాగేటి సాల్లల్ల నా తెలంగాణ నా తెలంగాణ అంటూ పాట రాశారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా సాహిత్య వికాసానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సమానత్వం కోసం డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ ఉద్యమాన్ని మొదలుపెట్టే ముందే తెలంగాణకు చెందిన భాగ్యరెడ్డి వర్మ గొంతు వినిపించారని తెలిపారు. వర్మ సమానత్వం కోసం పాటుపడడం గర్వకారమన్నారు.అంతకుముందు జయశంకర్ వర్థంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అనునిత్యం ప్రజలను జాగరూక పరుస్తూ సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యమ స్పూర్తి ప్రదాత జయశంకర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ గోరేటి వెంకన్న, తిరునగరి దేవకిదేవి, గోగు శ్యామల, ఏనుగు నరసింహరెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, భారత్ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, పలువురు కవులు పాల్గొన్నారు.