DailyDose

రేపు హైదరాబాద్ లో పార్కులు బంద్-TNI నేటి తాజా వార్తలు

రేపు హైదరాబాద్ లో పార్కులు బంద్-TNI నేటి తాజా వార్తలు

రేపు హైదరాబాద్ లో పార్కులు బంద్

హైదరాబాద్ లో గురువారం పార్కులను మూసివేయనున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 22న తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సచివాలయం పరిసర ప్రాంతాల్లోని పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది. పార్కుల వద్దకు వచ్చే ప్రజలకు, సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

తిరుమలలో బుధవారం నాడు భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 71,935 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 31,831 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు

దేశంలో వడగాలుల తీవ్రతపై రంగంలోకి దిగిన కేంద్రం

దేశంలో జూన్ లోనూ వేడి వాతావరణం నెలకొంది. రుతు పవనాలు ఆలస్యం కావడం, దేశంలో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తీవ్రమైన వేడిగాలుల నుంచి అతితీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వడగాలుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో పాటు, భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారులు నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

నేడు ఆధ్యాత్మిక దినోత్సవం

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆధ్యాత్మిక దినోత్సవం’ ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ఆలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను అత్యంత సుందరంగా అలంకరించారు. దేవాలయాల్లో 3 వేద పారాయణాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక భక్తి, సాంస్కృతిక, హరికథలు, పురాణ ప్రవచనాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇంటర్నేషనల్ యోగా డే.. యోగా చేసిన శునకం

ఐటీబీపీ క్యాంప్ లో సిబ్బంది యోగసనాలు చేస్తుండగా, ఐటీబీపీకే చెందిన ఓ శునకం కూడా పాల్గొంది. పెద్దగా అరుస్తూ మధ్య మధ్యలో ఆసనాలు వేస్తూ అక్కడ సందడి చేసింది. దీని హడావుడి చూస్తుంటే ‘నేను కూడా చేస్తున్నాను చూశారా?’ అన్నట్టుగా ఉంది. ఐటీబీపీ డాగ్ స్క్వాడ్ లో ఇది కూడా ఒకటి. ‘‘బద్ధకస్తులైన మీ మానవులకే యోగా అవసరం కానీ, మా లాంటి జీవులకు కాదు’’ అంటూ ట్విట్టర్ యూజర్ ఒకరు కామెంట్ పెట్టడం గమనార్హం.

నేడు కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభం

కరీంనగర్‌ లో మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జి ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిపై దేశంలోనే తొలిసారిగా డైనమిక్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌లోని దుర్గం చెరువు తర్వాత రాష్ట్రంలో నిర్మించిన రెండో కేబుల్‌ బ్రిడ్జి ఇది. మానేరు నదిపై కరీంనగర్‌ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్‌ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.నాలుగు వరుసలతో 500 మీటర్ల పొడవున నిర్మించిన బ్రిడ్జికి అవసరమైన కేబుల్‌ను ఇటలీ నుంచి తీసుకొచ్చారు. పాదచారుల కోసం రెండువైపులా కలిపి 1.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ నిర్మించారు. ఈ బ్రిడ్జిపై నుంచి చూస్తే.. ఒకవైపు మధ్యమానేరు జలాశయంతోపాటు రూ.410 కోట్లతో నిర్మిస్తున్న మానేరు రివర్‌ఫ్రంట్‌ వ్యూ మొత్తం కనిపించనుంది.

యోగా.. ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతి

ప్రపంచవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని( 9th International Day of Yoga) ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఐరాస వేదికగా జరగనున్న యోగా కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. మరో వైపు కేంద్రమంత్రులు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో యోగా కార్యక్రమాల్ని ముందుండి నడిపిస్తున్నారు. మంచుకొండల్లో ఆర్మీ నిర్వహించిన యోగా దినోత్సవ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

 ఈ ఏడాది యోగా థీమ్ ఏంటో తెలుసా..?

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది వసుదైవ కుటుంబకం అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. భూమి అంతా ఒకటే.. అనేలా ఆరోగ్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక చింతన కోసం యోగా నిర్వహిస్తున్నారు.

రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల కీలక సూచనలు

తెలంగాణ రాష్ట్ర రైతులకు బిగ్‌ అలర్ఠ్‌. తెలంగాణ రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో విత్తనాలు విత్తుకోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. వరి నార్లు పోసేవారు స్వల్పకాలిక వరి రకాలను ఎంచుకోవాలన్నారు.పత్తి విత్తనాలను జూలై 20 వరకు, కంది ఆగస్టు 15, సోయాచిక్కుడు జూన్ నెలఖరు వరకు, మొక్క జొన్న, పెసర, మినుము జూలై 15 వరకు విత్తుకోవచ్చని…ఆముదాలు, సన్ ఫ్లవర్, ఉలవలు జులై 31 వరకు సాగు చేసుకోవచ్చని తెలిపారు. కాగా, అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది.

దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ కామన్ కౌన్సెలింగ్

దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్ అడ్మిషన్లు, పరీక్షలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన క్యాలెండర్ను రూపొందిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 1న ప్రారంభించి.. ఆగస్టు 30న ముగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. 2024 నుంచి కామన్ కౌన్సెలింగ్ ఉంటుందని.. ఇక నుంచి సప్లిమెంటరీ బ్యాచ్లు ఉండవని నేషనల్ మెడికల్ కమిషన్ పేర్కొంది.

2న కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు జులై రెండున ఖమ్మంలో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమం ఖరారైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అంతకుముందే ఈ నాయకులిద్దరూ ఈ నెల 25న దిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమై చర్చించి, 26న దిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటిస్తారని సమాచారం.