అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. వైట్ హౌస్ కు చేరుకున్న ప్రధానికి బైడెన్ దంపతులు స్వాగతం పలికారు. ఆ తర్వాత బైడెన్ తో మోదీ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారం, ఇండో ఫసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పరిటీ వంటి అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మోదీ వాషింగ్టన్ చేరుకునే సమయానికి వర్షం పడుతోంది. అయినా ప్రవాస భారతీయులు వెనక్కి తగ్గకుండా ఆయన ఘనస్వాగతం పలికారు. దీనిపై మోదీ ప్రత్యేక ట్వీట్ చేశారు. ‘‘వాషింగ్టన్ డీసీ చేరుకొన్నాను. భారతీయుల ఆత్మీయ స్వాగతం.. ఇంద్రదేవత ఆశీర్వాదం దీనిని మరింత స్పెషల్‌గా చేశాయి’’ అని ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షడు బైడెన్ ప్రత్యేక కానుకలు ఇవ్వనున్నారు. 20వ శతాబ్ధం ప్రారంభంలో పూర్తిగా చేతితో తయారు చేసిన పుస్తకం ‘గ్యాలీ’ని, ఒక పురాతన కెమెరాను, తొలి కొడాక్ కెమెరా కోసం జార్జ్ ఈస్ట్‌మన్‌కు జారీ చేసిన పేటెంట్ ఆర్కైవల్ కాపీ, అమెరికా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ హార్డ్‌బుక్‌ను బైడెన్ గిఫ్ట్ ఇవ్వనున్నారు. ప్రముఖ కవి రాబర్ట్ ఫ్రాస్ట్ సేకరించిన కవితల సైన్డ్ కాపీని జిల్ అందించనున్నారు.కాగా ఇవాళ అమెరికా కాంగ్రెస్లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం నోబెల్ విజేత, ఆర్థికవేత్త పాల్ రోమన్‌తో సమావేశమవుతారు. రేపు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మోదీకి విందు ఇవ్వనున్నారు. అదేవిధంగా వివిధ కంపెనీల సీఈవోలు, వ్యాపారస్తులతో ప్రధాని సమావేశమవుతారు. అదేరోజు వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆయన ఈజిప్ట్ పర్యటనకు వెళ్తారు. అక్కడ మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ప్రధాని హోదాలో మోడీ ఈజిప్టులో పర్యటించడం ఇదే తొలిసారి.