DailyDose

కోటి విరాళం ఇస్తే 142 కోట్ల జరిమానా

కోటి విరాళం ఇస్తే 142 కోట్ల జరిమానా

ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా నేత. గత ఎన్నికల సమయం నుంచి ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు. చాలాకాలంగా కాంట్రాక్టు పనులు, రహదారి కంకర క్వారీ ద్వారా మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల ఆయన చూపు తెదేపా వైపు మళ్లింది. ఆ పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడులో రూ.కోటి విరాళం అందజేశారు. వెంటనే వైకాపా ప్రభుత్వం ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది.. గనులశాఖ అధికారులను రంగంలోకి దించి.. కంకర వ్యాపారంలో ఆయన అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రూ. 142 కోట్ల జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఇదీ కావలికి చెందిన దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి)పై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు తీరు. కావ్య కృష్ణారెడ్డి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు కావలి నియోజకవర్గ పరిధిలో క్వారీ, క్రషర్లు ఉన్నాయి. దాదాపు 15 ఏళ్లుగా ఆయన మైనింగ్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల తెదేపా తరపున బరిలో నిలవాలని భావిస్తున్నారు. ఆ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు. మహానాడులో రూ.కోటి విరాళం కూడా ఇచ్చారు. దీంతో ఆయన్ను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడంపై వైకాపా ప్రభుత్వం దృష్టిపెట్టింది.

కావలి నియోజకవర్గ పరిధిలోని గట్టుపల్లి, అన్నవరం గ్రామాల్లో అక్రమంగా కంకర, గ్రావెల్‌ తవ్వి తరలిస్తున్నట్లు కొందరితో స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెరమీదకు వచ్చారు. విచారణ జరపాలంటూ గనులశాఖను ఆదేశించారు. తొలుత నెల్లూరు, ప్రకాశం, జిల్లాల అధికారులతో విచారణ జరిపేందుకు సిద్ధమవ్వగా, సీఎంవో నుంచి ఒత్తిళ్లు రావడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. ఆ బృందం దాదాపు పది రోజులపాటు క్వారీల్లో తనిఖీలు నిర్వహించింది. గట్టుపల్లిలోని గురురాఘవేంద్ర క్వారీ, క్రషర్‌, అన్నవరంలోని రాఘవేంద్ర క్రషర్‌లో తనిఖీలు చేపట్టింది. అలాగే అన్నవరంలో గడువు ముగిసిన ఇతర లీజుల్లోనూ తనిఖీలు జరిపారు. భారీగా అక్రమాలు జరిగాయని తేల్చారు. వీటన్నింటికీ సీనరేజ్‌ ఫీజు, అంతే విలువైన కన్సిడరేషన్‌ నగదు, 30 శాతం జిల్లా ఖనిజ నిధి (డీఎంఎఫ్‌), 2 శాతం ఖనిజాన్వేషణ ట్రస్ట్‌ (మెరిట్‌), పదింతల జరిమానా కలిపి మొత్తం రూ. 142 కోట్ల మేరకు చెల్లించాలని నివేదిక రూపొందించారు. ఈ నివేదిక గనులశాఖ సంచాలకుని కార్యాలయానికి చేరింది.

ఆ ప్రాంతంలో ఆయన ఇన్నేళ్లుగా మైనింగ్‌ వ్యాపారం చేస్తుండగా.. ఇంతకాలం కనిపించని ఈ అక్రమాలు ఇప్పుడే ప్రభుత్వానికి ఎందుకు కనిపించాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకు గనులశాఖ, విజిలెన్స్‌ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? పర్మిట్లు ఎలా జారీ చేస్తూ వచ్చారు? గడువు ముగిసిన ఆయన లీజుకు రెన్యువల్‌కు ఎలా సిఫార్సు చేశారు? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో రహదారి కంకర క్వారీల్లో పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌ జరుగుతోంది. మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కొండలు, గుట్టలు, చెరువులను ఊడ్చేస్తున్నారు. నేతలు లారీకి కొంత మొత్తం చొప్పున వసూలు చేసి గ్రానైట్‌ను భారీగా పక్క రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇసుకలో జరుగుతున్న దోపిడీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిపై మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా, స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులుచేసినా అటువైపు చూడని గనులశాఖ.. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తే మాత్రం ఉల్లంఘనలు జరిగాయంటూ కొందరిపై వేధింపులకు సిద్ధమవుతోందనే విమర్శలు వస్తున్నాయి