Politics

సోము ఫైర్:చంద్రబాబుపై

సోము ఫైర్:చంద్రబాబుపై

ఏపీలో బలపడాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. 2019లో టీడీపీ ఓటమి తర్వాత కొందరు కీలక నేతలు కాషాయ కండువాలు కప్పుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ కమలం గూటికి చేరిపోయారు. అయినా సరే ఏపీలో బీజేపీకి కలిగిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో పార్టీ బలం ఏమాత్రం పెరగలేదనేది వాస్తవం. అదే సమయంలో బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ఉప్పునిప్పులా ఉండేవారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కన్నా సైకిల్ ఎక్కేశారు.

రాష్ట్ర బీజేపీ నేతలు రెండు, మూడు వర్గాలుగా చీలిపోయారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి నేతలు టీడీపీ వర్గంగా ముద్రవేసుకున్నారు. టీడీపీ, బీజేపీ మధ్య మళ్లీ పొత్తు కుదుర్చేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ వైసీపీకి కొమ్ముకాస్తున్నారని విమర్శలున్నాయి. చంద్రబాబు పేరు చెబితే ఈ ఇద్దరు నేతలు ఒంటికాలిపై లేస్తారు. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని సోము, జీవీఎల్ గతంలో చాలాసార్లు స్పష్టం చేశారు. తాము జనసేనతో కలిసి పోటీ చేస్తామని తేల్చి చెప్పారు.

సోము, జీవీఎల్ ఎలాంటి కామెంట్లు చేసిన చంద్రబాబు పట్టించుకోలేదు. ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టీడీపీ అధినేత మళ్లీ 2014 కాంబినేషన్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆ మధ్య ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. ఇక బీజేపీతో పొత్తు ఖాయమనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే పవన్ , చంద్రబాబు 3 సార్లు భేటీ అయ్యారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని దాదాపు తేలిపోయింది. ఇక బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తే కలుపుకుని పోవడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు.

తాజాగా సోము వీర్రాజు చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేయడంతో టీడీపీ, బీజేపీ పొత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీని అవమానించేలా మాట్లాడే వ్యక్తితో పొత్తు ఆలోచన ఎలా చేస్తామని సోము ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వద్దని చెప్పింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కావాలన్నది ఆయనేనని విమర్శించారు. ప్రధానులను మార్చే శక్తి ఉన్నవాడినని, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు రైల్వేజోన్‌ ఎందుకు తేలేకపోయారని నిలదీశారు. నోటాతో పోటీ పడే పార్టీ అని బీజేపీని విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు.

సీబీఐను రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన చంద్రబాబుకు ఇప్పుడు శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత లేదని సోము అన్నారు. టీడీపీ హయాంలో తిరుపతిలో హోంమంత్రి అమిత్‌ షాపై దాడి చేస్తే వాళ్లపై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఒకవైపు చంద్రబాబు బీజేపీకి దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు సోము వీర్రాజు ఘాటు విమర్శలు చేయడానికి కారణాలేంటి? ఏపీపై బీజేపీ వ్యూహమేంటి? టీడీపీ పొత్తు ఉండదా..? కాషాయ అధిష్టానం లెక్కలేంటి?