తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో వద్దిపర్తి పద్మాకర్ నిర్వహించిన అష్టావధానం ఘనంగా సాగింది. కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న దుర్గాదేవి గుడిలో చేపట్టిన ఈ కార్యక్రమం ఆద్యంతం అందర్నీ నవ్వుల్లో ముంచెత్తింది. చాలా ఏళ్ల తర్వాత అవధాన ప్రక్రియని ప్రత్యక్షంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సభకు హాజరైన సీనియర్ సిటిజన్లు హర్షం వ్యక్తం చేయగా.. తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటుందని తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు యువత ఆనందం వ్యక్తం చేశారు.గత రెండు నెలలుగా వద్దిపర్తి పద్మాకర్ అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా.. అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో ప్రవచనాలు, ఒక అష్టావధానం, ఒక శతావధానం నిర్వహించారు. తాజాగా కెనడాలో 1250వ అష్టావధానం నిర్వహించారు. సమస్య, ఆశువు, వర్ణన, అప్రస్తుత ప్రసంగం ఇలా అన్ని అంశాలతో సభను మరింత రక్తికట్టించిన పృచ్ఛకులను, తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్, తెలుగుతల్లి కెనడా సంస్థలను పద్మాకర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు లక్ష్మి రాయవరపు మాట్లాడుతూ ‘‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం. తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుదనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా సంస్థను నెలకొల్పాం. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటుకు చేర్చే వేదిక’’ అని చెప్పారు.
తెలుగువాహిని అధ్యక్షులు త్రివిక్రం సింగరాజు మాట్లాడుతూ.. శ్రీకృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద చదవడం నుంచి, భావుకత పెంచే నేటితరం వచన కవితలు రాయించేదాకా సభ్యులను తీర్చిదిద్దే పూర్తి బాధ్యత తెలుగు వాహినిది’’ అని తెలిపారు.ఒంటారియో తెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు మురళి పగిడేల మాట్లాడుతూ ‘‘ఒంటారియోలో ఉంటున్న తెలుగువారికి కావలసిన సహాయం చేసి, సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడడమే ఓటీఎఫ్ ముఖ్య ఉద్దేశం” అని అన్నారు.