ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది. దీంతో 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త మిషన్‌ను ప్రయోగించేందుకు ఇస్రో, నాసా అంగీకరించాయి. జో బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు.అమెరికా ఓవల్ ఆఫీస్‌లో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ల మధ్య సమావేశానికి కొన్ని గంటల ముందు ఈ అధికారి మాట్లాడారు.. మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష పరిశోధన నిమిత్తం ఆర్టెమిస్ ఒప్పందంపై భారతదేశం, అమెరికా సంతకాలు చేయబోతున్నాయని చెప్పారు. ఆర్టెమిస్ ఒప్పందాన్ని 2020లో నాసా ప్రతిపాదించింది.
ఆర్టెమిస్ ఒప్పందం అంటే ఏమిటి?ఆర్టెమిస్ ఒప్పందం పౌర అంతరిక్ష అన్వేషణలో ఒకే ఆలోచన కలిగిన దేశాలను ఒకచోట చేర్చింది. ఆర్టెమిస్ ఒప్పందం 1967 ఔటర్ స్పేస్ ట్రీటీపై ఆధారపడింది. ఆర్టెమిస్ ట్రీటీ అనేది 21వ శతాబ్దంలో పౌర అంతరిక్ష పరిశోధనలకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడే నాన్-బైండింగ్ సూత్రాల ‘సెట్’. 2025 నాటికి మరోసారి చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది.నాసా-ఇస్రో సంయుక్త అంతరిక్ష యాత్ర,మార్స్, ఇతర గ్రహాల వరకు అంతరిక్షాన్ని అన్వేషించడం దీని ఉద్దేశ్యం. 2024లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సంయుక్త అంతరిక్ష యాత్రను ప్రారంభించేందుకు ఇరు దేశాల ఏజెన్సీలు, నాసా, ఇస్రో అంగీకరించాయని అధికారి తెలిపారు.