Politics

నేడు ‘జగనన్న సురక్ష’ ప్రారంభం

నేడు ‘జగనన్న సురక్ష’ ప్రారంభం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 23న ప్రారంభించనున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా అధికారులు, మండల, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగనన్న సురక్ష అమలుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంచి ప్రభుత్వంపై సానుకూల దృక్ఫథం పెంచే లక్ష్యంతో జగనన్న సురక్షను ప్రవేశ పెడుతున్నారన్నారు. ప్రతి అధికారి, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు సమన్వయంతో ప్రజలకు క్యాంపుల ద్వారా, షెడ్యూల్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఇంటింటి సందర్శన, క్యాంప్‌ నిర్వహణపై జేసీఎస్‌ నెట్‌ వర్క్‌ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు చెప్పారు. ఈనెల 23 నుంచి 30 వరకూ గ్రామ , వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి ఇంటినీ సందర్శించాలన్నారు. ఏ సర్టిపికెట్‌ ఎవరికి అవసరమో తెలుసుకొని దానికి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకోవాలన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 1 వరకూ ప్రతి సచివాలయం పరిధిలో నిర్వహించే క్యాంపులో వారికి అవసరమైన సర్టిఫికెట్లు అందజేయాలన్నారు. ఈ క్యాంపులో కుల, ఆదాయ, నివాస, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, మరణ ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఆధార్‌ అనుసంధానం, కొత్త రేషన్‌ కార్డు, రేషన్‌ కార్డులో సభ్యుల పేర్లు నమోదు, కౌలు రైతుల సర్టిఫికెట్లు, తదితర 12 సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమం అనంతరం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన పశుబీమా పోస్టర్లను విడుదల చేశారు. దీనిపై ప్రతి పాడి రైతుకూ అవగాహన కల్పించాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ విజయ్‌కుమార్‌, డీఎంహెచ్‌ఓ కృష్ణారెడ్డి, ఏడి రామకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ రషీద్‌ఖాన్‌, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్‌, జిల్లా ఉద్యాన అధికారి చంద్రశేఖర్‌, డ్వామా పీడీ రామాంజనేయులు, సివిల్‌ సప్లయీస్‌ అధికారి వంశీకృష్ణారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌బాషా పాల్గొన్నారు.నేడు లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌